తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బహుజన భవన్‌గా మారుస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానిని దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా చేస్తామని చెప్పారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్కువగా తెలంగాణ నుంచే వచ్చేలా చూస్తామన్నారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో రేవంత్‌రెడ్డి చేపట్టిన 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష బుధవారం సాయంత్రంతో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహా హాజరై రేవంత్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఎలాంటి కోరికలేవు.. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో దళిత, గిరిజన, ఆదివాసీల విద్యకు ప్రత్యేక బడ్జెట్ కోసం మొదటి సంతకం పెట్టిస్తా’’ అని చెప్పారు. దళితబంధు అందరికీ ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని, బడ్జెట్ సరిపోకపోతే సెక్రటేరియట్, అసెంబ్లీ అమ్ముదామని, ఎక్కడ సంతకం పెట్టాలో చెబితే పెడతామన్నారు.
ఏ శిక్షకైనా సిద్ధం
తన ప్రసంగంలో మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మేడ్చల్ ప్రాంతంలో ఎవరు భూములు అమ్మినా.. కొన్నా మంత్రికి కమీషన్లు ఇవ్వాల్సిందేనని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా.. కబ్జాలతో ఆక్రమించిన.. అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, జవహార్‌నగర్‌లో దవాఖానా, యూనివర్సిటీ భూములపై విచారణ చేయించాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే సీఎం వేసే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. మల్లారెడ్డి అవినీతిపై ఊరూరా తిరిగి ప్రచారం చేస్తామన్నారు.
‘‘తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం చేసి ఉండొచ్చు. ఆయనకు కష్టానికంటే ఎక్కువ కూలీ దక్కింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొందరే బాగుపడ్డారు. టైమొస్తే బీసీ, మైనార్టీ, బ్రాహ్మణులకు ‘బంధు’ ఇస్తానని సీఎం చెబుతున్నారు. కానీ కేసీఆర్ టైం అయిపోయింది. ఇక ఆయన ఇంటికే. ఇప్పుడు తెలంగాణ సమాజానికి టైం వచ్చింది’’ -రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు