ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా తగ్గిన ఫలితం.. భారీ నష్టం! - కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా

పద్నాలుగో ఆర్థిక సంఘంతో పోల్చితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌.. కేంద్ర పన్నుల్లో అయిదేళ్లలో రూ.10,900 కోట్లు నష్టపోనుంది. గత ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 4.305 శాతం వాటా దక్కగా ఈసారి అది 4.047కి పడిపోయింది. 0.258 మేర వెయిటేజీ కోల్పోవడంతో అయిదేళ్ల కాలంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ.10,900 కోట్లు కోతపడనుంది.

budget
budget

By

Published : Feb 2, 2021, 7:52 AM IST

ఎన్‌కేసింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి సమర్పించిన తాత్కాలిక నివేదికలో రాష్ట్రానికి 4.111 వెయిటేజీ ఇచ్చింది. కానీ పూర్తి స్థాయి నివేదికలో 4.047కి తగ్గించింది. ఈ రకంగా చూసినా అయిదేళ్ల కాలంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రూ.2,704 కోట్లు కోతపడనుంది. తాత్కాలిక నివేదిక తరహాలోనే తుది నివేదికలోనూ ఆర్థికసంఘం జనాభాకు 15%, ప్రాంతానికి 15%, అడవులు, పర్యావరణానికి 10%, ఆదాయవ్యత్యాసాలకు 45%, డెమోగ్రఫిక్‌ పెర్ఫార్మెన్స్‌కి 12.5%, పన్నులు, ఆదాయకల్పన ప్రయత్నాలకు 2.5% వెయిటేజీ ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర వెయిటేజీలో తేడా వచ్చింది.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా తగ్గిన ఫలితం

73% పన్నుల వాటా రూపంలోనే

వచ్చే అయిదేళ్లలో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నుల్లో వాటా కింద రూ.42,24,760 కోట్లు పంచాల్సి వస్తుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. దీనిలో రాష్ట్రానికి రూ.2,34,013 కోట్లు రానుంది. ఇందులో 73% పన్నుల వాటాయే. రెవెన్యూలోటు కింద అయిదేళ్ల కాలానికి రూ.30,497 కోట్లను ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. గత ఆర్థికసంఘం కాలం కంటే ఇది రూ.8,384 కోట్లు అధికం. క్రితంసారి కేంద్ర పన్నుల్లో వాటా, రెవెన్యూ లోటు కలిపి రాష్ట్రానికి రూ.1,92,798 కోట్లు రాగా ఈసారి అది రూ.2,01,473 కోట్లకు చేరనుంది.

లక్ష్మణరేఖను దాటేసిన అప్పులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల వాటా ఎక్కువగానే ఉంది. 14వ ఆర్థికసంఘం కాలావధిలో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో గరిష్ఠంగా 25.22 మేర ఉండగా, ఈసారి 35%కి చేరుతున్నట్లు ఆర్థికసంఘం అంచనా వేసింది. జీఎస్‌డీపీలో అప్పులు 25% ఉండాలి. బడ్జెటేతర రుణాలు కలుపుకున్నా అది 30 శాతానికి మించకూడదన్నది ప్రామాణిక ఆర్థిక సూత్రం. ప్రస్తుతం ఏపీ రుణాలు ఆ లక్ష్మణరేఖను దాటేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సొంత ఆదాయ వనరులను మెరుగుపరచుకోవాలని ఆర్థికసంఘం సూచించింది. ఎక్సైజ్‌, స్టాంప్‌ డ్యూటీ, ఖనిజాల నుంచి రాయల్టీ మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది. రాష్ట్ర బడ్జెట్‌లో మూలధన వ్యయ నిష్పత్తినీ పెంచాలని సూచించింది. మొత్తం వ్యయంలో దాదాపు 86% రెవెన్యూ వ్యయంగా ఉందని పేర్కొంది. దేశంలో అత్యధిక రెవెన్యూ వ్యయం ఉన్న రాష్ట్రాల సరసన ఏపీ కూడా చేరిందని వెల్లడించింది. సాగునీరు, తాగునీటి రంగాలపై మూలధన వ్యయం పెంచాలని ఆర్థికసంఘం పేర్కొంది. విద్యుత్తు సరఫరా కోసం పెడుతున్న ఖర్చులు వచ్చేలా విద్యుత్తురంగాన్ని సరిపోల్చుకుని చూడాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాలకు తగ్గిన వాటా

14వ ఆర్థికసంఘంతో పోలిస్తే 15వ ఆర్థికసంఘం కాలంలో రాష్ట్రాలకు వచ్చే పన్నులు, గ్రాంట్ల వాటా తగ్గింది. క్రితంసారి అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నులు, గ్రాంట్ల రూపంలో రూ.59,63,484 కోట్లు రాగా, ఈసారి రూ.52,41,422 కోట్లకు పరిమితమైంది. అయితే ఇదివరకు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల జాబితాలో ఉండేది కాబట్టి 29 రాష్ట్రాలు ఉండేవి. అది ఈ జాబితాలో లేకపోవడంతో ఈసారి రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గింది.

*ఇదివరకు కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా కింద రూ.39,48,187 కోట్లను సిఫార్సు చేయగా, ఇప్పుడది రూ.42,24,760 కోట్లకు చేరింది.

*క్రితంసారి రెవెన్యూలోటు కింద రూ.1,94,821 కోట్లు ఇవ్వాలని చెప్పగా, ఇప్పుడది రూ.2,94,514 కోట్లకు పెరిగింది.

*14వ ఆర్థికసంఘం తొలి ఏడాది రెవెన్యూలోటు రాష్ట్రాలు 10 ఉండగా, చివరి ఏడాదికి ఆ సంఖ్య 7కి తగ్గింది. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రాల సంఖ్య 17కి చేరింది. అందువల్లే రెవెన్యూలోటు కింద అత్యధిక మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌ (రూ.40,115 కోట్లు), కేరళ (రూ.37,814 కోట్లు), హిమాచల్‌ప్రదేశ్‌ (రూ.37,199 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.30,497 కోట్లు)కు వెళ్తోంది. క్రితంసారి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో రూ.18,20,476 కోట్లు రాగా, ఈసారి అది రూ.7,22,148కోట్లకే పరిమితమైంది.

తొలి మూడేళ్లే రెవెన్యూలోటు

ఏపీకి మూడేళ్లు మాత్రమే రెవెన్యూలోటు ఉంటుంది. చివరి రెండేళ్లు రెవెన్యూ మిగులులోకి వస్తుంది. అందుకే రెవెన్యూలోటు కింద కేటాయించిన రూ.30,497 కోట్లలో తొలి ఏడాది రూ.17,257 కోట్లు, మలి ఏడాది రూ.10,549 కోట్లు, మూడో ఏడాది రూ.2,691 కోట్లు దక్కుతుంది. చివరి రెండేళ్లు ఏమీ రాదు.

ఇదీ చదవండి:

బడ్జెట్​: ఆకర్షణీయ పథకాలకు దూరం.. ఆదాయానికే ప్రాధాన్యం

ABOUT THE AUTHOR

...view details