భూములు, స్థలాలపై మార్కెట్ విలువల పెంపుదలను వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల క్రెడాయి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ క్రెడాయి ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ ఎస్.వెంకటరామయ్య, అధ్యక్షుడు ఎ.రాజాశ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కె.ఎస్.సి.బోస్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆగస్టు నెలలో భూములు, స్థలాలపై మార్కెట్ విలువలను పెంచడం సంప్రదాయంగా ఉంది. దీనివల్ల నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతుందంటూ క్రెడాయ్ ప్రతినిధులు రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్... స్టాంపులు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు.
ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న నిర్మాణ రంగంపై భూముల మార్కెట్ విలువలు పెంపు మరింత భారంగా పరిణమిస్తుందని వివరించారు. క్రెడాయి 20 సిటీ చాప్టర్లన్నీ అన్ని జిల్లాల్లో స్టాంపుల విభాగం డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు విజ్ఞప్తులను అందజేశారు. భూములు, స్థలాల విలువ పెంపును వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బిల్డర్లకు, సామాన్య ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని క్రెడాయి పేర్కొంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ఉన్న స్టాంప్ డ్యూటీని కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టాంప్ డ్యూటీ తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అంతేకాకుండా స్తబ్దుగా ఉన్న నిర్మాణ రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.