తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు రేపు పునఃప్రారంభం కానున్నాయి. దంత, నర్సింగ్, ఫిజియోథెరపీ తదితర కళాశాలలనూ గురువారం నుంచి తిరిగి తెరుస్తారు. వచ్చే నెల 1 నుంచి వైద్యకళాశాలల ప్రారంభానికి అనుమతులు కోరుతూ కాళోజీ ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన అనంతరం నిర్ణయాన్ని మార్చుకొని మూడు రోజుల ముందుగానే కళాశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తరగతులకు హాజరైతేనే.. ఆసుపత్రుల్లో రోగులను పరీక్షించడానికి అవకాశం కలుగుతుంది. ఇంట్లోంచి ఆన్‌లైన్ తరగతులు ఎంత విన్నా.. అనుభవపూర్వకంగా నేర్చుకునే దానితో సమానం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో వైద్య తరగతుల పునఃప్రారంభానికి ఇదే మంచి తరుణమని వర్సిటీ వర్గాలు ఆలోచించాయి.
అనుభవపూర్వక శిక్షణ..
ఎప్పుడు కొవిడ్ మూడోదశ ఉద్ధృతి మొదలవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా వైద్య కళాశాలలను తిరిగి ప్రారంభించడం మంచిదనే భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. తొలుత కేవలం తుది సంవత్సరం విద్యార్థులను మాత్రమే ప్రాక్టికల్స్, క్లినికల్ శిక్షణకు అనుమతించాలని భావించినా.. ఈ నిర్ణయంలోనూ మార్పు చేసింది. గురువారం నుంచి అన్ని సంవత్సరాల వైద్య, దంత, నర్సింగ్, ఫిజియోథెరపీ విద్యార్థులు అనుభవపూర్వక శిక్షణకు హాజరు కావాలని వర్సిటీ ఆదేశాలు జారీ చేసింది.