రాష్ట్రంలో 2021-22 నాటికి 15 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటుచేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. రాష్ట్రంలో ఉన్న అవకాశాల దృష్ట్యా అదనంగా మరో 9 వేల మెగావాట్ల ప్రాజెక్టులను కేటాయించింది. అంటే వచ్చే ఏడాదికి 24 వేల మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇంత పెద్ద మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వస్తే గ్రిడ్ నిర్వహణ కష్టమని డిస్కంలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి, గ్రిడ్ భద్రత, ఇతర ఖర్చుల రూపేణా రూ.4 వేల కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి.
ఈ భారం మరీ పెరగకుండా.. 7వేల మెగావాట్ల ప్రాజెక్టులనే రాష్ట్రంలో ఏర్పాటుచేసేలా చూడాలని ఏపీఈఆర్‌సీకి దాఖలు చేసిన పిటిషన్‌లో డిస్కంలు ప్రస్తావించాయి. కానీ, ప్రభుత్వం అదనంగా మరో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. న్యాయపరమైన వివాదాల కారణంగా టెండర్లను కోర్టు రద్దుచేసింది. లేకుంటే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేవి. ఇదే జరిగితే గ్రిడ్ నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.15 వేల కోట్లను వెచ్చించాలని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.
డిస్కంల అభ్యంతరాలు ఇవీ..
పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించటం వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి ఏపీఈఆర్‌సీకి ఏపీ ట్రాన్స్‌కో గతంలో లేఖ రాసిందని డిస్కంలు తెలిపాయి. పునరుత్పాదక విద్యుత్ ఎక్కువగా అనుసంధానం చేయటం వల్ల తక్కువ గ్రిడ్ సామర్థ్యం ఉన్న రాష్ట్రాలు ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్నాయని కేంద్ర విద్యుత్ అథారిటీ(సీఈఏ) పేర్కొన్న విషయాన్ని డిస్కంలు ప్రస్తావించాయి.
* ఏపీ గ్రిడ్ వ్యవస్థ 5,300 నుంచి 10,170 మెగావాట్ల మధ్య పనిచేస్తోంది. వాతావరణ మార్పులతో అంచనాలు.. లభ్యతకు మధ్య వ్యత్యాసంతో రోజువారీ విద్యుత్ ప్రణాళికలో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు వస్తున్నాయి.
* సౌర, పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయక ముందు గ్రిడ్ నిర్వహణలో అనిశ్చితి చాలా తక్కువ.