'విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో కొవిడ్‌కు చికిత్స పొందుతున్న వ్యక్తికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ అవసరమైంది. విజయవాడ గాంధీనగర్‌లో ఉన్న ఓ డ్రగ్‌స్టోర్‌లో ఇంజక్షన్లు అతి తక్కువ ధరకే అందిస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో నగరానికి చెందిన ఓ మిత్రుడి ద్వారా ప్రయత్నం చేశారు. తీరా అక్కడికి వెళ్లాక.. అసలు విషయం అర్థమైంది. కేవలం ఆరు డోసులే ఉన్నాయని, ఎవరు ఎక్కువ ధర ఇస్తే.. వారికే ఇస్తామంటూ అక్కడ కొందరు దళారులు దందా ఆరంభించారు. ఇంజక్షన్ అత్యవసరమని వైద్యులు చెప్పడంతో ఒక్కో డోసు 30 వేల చొప్పున రూ.1.80 లక్షలు చెల్లించి ఆరు కొనుగోలు చేసి విశాఖపట్నం పంపించారు.’
ప్రస్తుతం రెమ్‌డెసివిర్ డ్రగ్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో.. విజయవాడ కేంద్రంగా రూ.లక్షలు దండుకుంటున్న దళారులు ఎక్కువైపోయారు. గత కొద్దిరోజులుగా నిత్యం విజయవాడ కమిషనరేట్, జిల్లా పోలీసులు ఎక్కడో ఓ చోట రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకుంటూనే ఉన్నారు. ఇలా దొరుకుతున్న వారిలో అత్యధికమంది వైద్య వృత్తిలో ఉన్న వారే కావడం ఆందోళనకర పరిణామం. కొవిడ్ సమయంలో నిబద్ధతతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది ఒకవైపు ఉండగా.. ఇలా అడ్డంగా జనం నుంచి దోపిడీ చేస్తున్న వాళ్లు మరోవైపు పెరిగిపోతున్నారు. అదికూడా విజయవాడ కేంద్రంగానే ఈ దందాను ఎక్కువగా సాగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఫలానా చిరునామాలో దొరుకుతాయంటూ ప్రచారం చేస్తూ.. వస్తున్న వారిని అడ్డంగా దోచుకుంటున్నారు.
బాధితులను ఆందోళనకు గురిచేసి..
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను సిబ్బందే ఆందోళనకు గురిచేసి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దాంతో రూ.లక్షలు వెచ్చించి బ్లాక్‌మార్కెట్‌లో బాధితుల బంధువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని అవసరమైతే వినియోగిస్తామంటూ సిబ్బంది దాచి ఉంచుతున్నారు. బాధితుల్లో కొంతమంది కోలుకుని వెళ్లడం, కొందరు చనిపోవడం జరుగుతోంది. వీరి కోసం కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఇంజక్షన్లను ఆసుపత్రి సిబ్బందే ఉంచుకుంటూ.. వాటిని బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందట విజయవాడలోని రెండు మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫార్మాసిస్టు, వార్డుబాయ్, కంపౌండర్లుగా పనిచేస్తున్న ఐదుగురిని ఈ ఇంజక్షన్లను నడిరోడ్డుపై అమ్ముతుండగా టాస్కుఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్సకు చేరి చనిపోయిన వారికి సంబంధించిన వాటిని వీరు విక్రయిస్తూ పోలీసులకు దొరికారు.