ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగని రెమ్‌డెసివిర్‌ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు - Remindesivir Illegal sales in AP

ఒకవైపు పోలీసుల నిఘా.. మరోవైపు ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ.. ఇంకో వైపు నిఘా విభాగం (విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) దాడులు.. అయినా రెమ్‌డెసివిర్‌ దందా ఆగడం లేదు. కరోనా సోకిన రోగులకు సంజీవినిగా భావిస్తున్న ఈ ఔషధం నల్లబజారులో కాసులు కురిపిస్తోంది. ఒక్క రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వయల్‌ను రూ.40వేలకు విక్రయిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. రెమ్‌డెసివిర్‌ విక్రయాలు పూర్తిగా ఔషధ నియంత్రణ శాఖ పరిధిలో ఉన్నా నల్లబజారులో మాత్రం ఎన్ని కావాలంటే అన్ని లభిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి స్మగ్లింగ్‌ చేయడంతో పాటు స్థానికంగా కొంత మంది సిబ్బంది ప్రమేయంతో వీటిని నల్లబజారుకు తరలిస్తున్నారు.

Remdesivir
Remdesivir

By

Published : May 15, 2021, 12:43 PM IST

కరోనా నియంత్రణకు రెమ్‌డెసివిర్‌ అంత ప్రాధాన్యం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నా బాధిత కుటుంబ సభ్యులు వీటిని రూ.వేలకు వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో అక్రమ విక్రయాల జోరు పెరుగుతోంది. విజయవాడ కేంద్రంగానే ఇతర ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. విజిలెన్స్‌ విభాగం పరిశీలనలో పలు అంశాలు వెలుగుచూశాయి. ఇటీవల దాడుల్లో ముగ్గరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరంతా ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కావడం విశేషం. 8 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ విక్రయాలు ఇలా..!

ఔషధాలపై అవగాహన ఉన్న కొంత మంది మెడికల్‌ రిప్‌లతో ప్రారంభమైన ఈ దందా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల సిబ్బంది కొనసాగిస్తున్నారు. ఆస్పత్రులతో లింకులు ఉన్న వ్యక్తులు వీటిని సేకరించి అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో దుకాణాల్లోనే అధిక ధరలకు విక్రయించేవారు. ప్రస్తుతం ఈ ఇంజక్షన్లను ఔషధ నియంత్రణ శాఖ పరిధిలోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు కావాల్సిన ఇంజక్షన్లను అవసరాన్ని బట్టి ఔషధ నియంత్రణ శాఖ అందిస్తోంది. నేరుగా ఆస్పత్రులకే సరఫరా చేస్తోంది. అయితే ఆస్పత్రి అడిగినంత కాకుండా వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇస్తున్నారు. ఇలా పంపిణీ చేసిన ఇంజక్షన్లు పక్కదారి పడుతున్నాయి. కొన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారు. ఒక రోగికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 6 ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మందికి పూర్తి స్థాయి డోసు ఇవ్వడం లేదని తెలిసింది. ఇటీవల పట్టుబడిన ముఠా చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. అసలు రోగికి ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేసి కొన్నింటిని తప్పిస్తున్నారు. ఇదో దందా. బెంజిసర్కిల్‌ సమీపంలో ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆరు ఇంజక్షన్లను 8 మందికి సర్దుబాటు చేసి అందులో రెండు తస్కరించారని తెలిసింది. ఇలా చాలా వరకు తస్కరించడం, వాటిని నల్లబజారులో విక్రయించడం చేస్తున్నారు. ఒక ఇంజక్షన్‌ పూర్తిగా ఒక రోగికి ఇవ్వాల్సి ఉంటుంది. పొడి రూపంలో ఉన్న ఇంజక్షన్‌ను ద్రవరూపంలోకి మార్చి ఎక్కిస్తారు. ఇలా చేసే సమయంలో 10 ఎంల్‌ పక్కన పెట్టేవారు. దీన్ని మరో ఇంజక్షన్‌లో మిగిలిన మరో 10ఎంఎల్‌ కలిపి మరో రోగికి ఇచ్చేవారు. అతని వద్ద ఉన్న వయల్‌ పక్కకు తప్పిస్తారు. ఇలా పూర్తి స్థాయిలో వేయకుండా మోసం చేసేవారు.

పలువురి అరెస్టు..!

విజయవాడలో ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ అక్రమ విక్రయాలపై నాలుగు కేసులు నమోదయ్యాయి. భారీగా ఇంజక్షన్‌లను పట్టుకున్నారు. కనిష్ఠంగా రూ.40వేలకు ఒకటి విక్రయిస్తున్నారు. ఈ ఇంజక్షన్‌ వేస్తే వైరస్‌ లోడ్‌ తగ్గుతుందని, ప్రైవేటుగా తెచ్చుకోవాలని ఆస్పత్రి వర్గాలే రోగి బంధువులకు సూచిస్తున్నాయి. చిరునామాలు తెలుపుతున్నాయి. దీంతో ఈ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇటీవల హైదరాబవాద్‌ నుంచి దాదాపు 300 ఇంజక్షన్లు రవాణా చేస్తుండగా జగ్గయ్యపేట సమీపంలో చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డాయి. గుంటూరుకు చెందిన వైద్యులు వీటిని తెప్పించడం గమనార్హం. విజయవాడ ఒకటో పట్టణంలో కొంత మంది వీటిని చాటుమాటుగా విక్రయిస్తున్నారు. ఈ ఇంజక్షన్‌ల పేరుతో నకిలీవి ఇస్తున్నట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. అనవసరంగా రెమ్‌డెసివిర్‌ కోసం ఎగబడటం వల్ల అక్రమార్కుల ఆటలు సాగుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి

భయమే శత్రువు.. కోలుకోవడానికి మనోస్థైర్యమే మందు

ABOUT THE AUTHOR

...view details