నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎస్ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - నిమ్మగడ్డ పునర్నియామకం వార్తలు
00:16 July 31
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్నియామకం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి హైకోర్టు ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్..నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ...తనను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్, జీవోలను.... సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మే 29న తీర్పిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు ఉత్తర్వుల అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపధ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలుపరిచేలా ఆదేశించాలని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్ కు సూచించింది. కోర్టు ఆదేశాల మేరకే ఇటీవల రమేష్ కుమార్ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. తనను కలిసి వినతి పత్రం సమర్పించిన రెండు రోజుల్లోనే గవర్నర్.... నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్నియమించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. హైకోర్టు ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటి॥షన్ దాఖలు చేసిన రాష్ట్రప్రభుత్వం.. ఎస్ఎల్పీ తుది తీర్పునకు లోబడే ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు