స్థానిక సమరానికి ముఖ్యనేతలు తమ కుటుంబసభ్యులను రంగంలోకి దింపారు. ప్రధానమైన పదవులు సాధించడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. బంధుగణాన్ని పోటీ చేయించవద్దని వైకాపా అధిష్ఠానం చెప్పినా ఆ పార్టీ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు.
- శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్.. జడ్పీ అధ్యక్ష స్థానమే లక్ష్యంగా తన భార్య వాణిని టెక్కలి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించారు. టెక్కలిలో పోటీచేసి ఓడిన తిలక్ భార్య భార్గవి, మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కృష్ణచైతన్య, ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్‌కుమార్ కూడా జడ్పీటీసీ బరిలో ఉన్నారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కుమార్తె మాన్విత జడ్పీటీసీ బరిలో నిలిచారు.
- పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోదరి జడ్పీటీసీ బరిలో ఉన్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బంధువు లక్ష్మీజ్యోతి జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం కౌన్సిలర్‌గా పోటీ చేశారు.
- గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తమ్ముడు విజయకుమార్‌రెడ్డి భార్య అరుణ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి గురి జడ్పీ పీఠంపైనే.
- అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి (వైకాపా) కుమార్తె నైరుతమ్మ, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అన్న కొడుకు పవన్‌గౌడ్ (తెదేపా) కౌన్సిలర్ స్థానాలకు పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కోడలు శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీ సభ్యురాలిగా (వైకాపా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి (వైకాపా) కుమారుడు అభినయ్‌రెడ్డి కార్పొరేటర్‌గా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైకాపా) కుమారుడు మోహిత్‌రెడ్డి ఎంపీటీసీగా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి భార్య పరంజ్యోతి కార్వేటినగరం జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- విజయవాడ మేయర్ పదవి కోసం ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత కార్పొరేషన్ బరిలోకి దిగారు. జడ్పీ ఛైర్మన్ స్థానమే లక్ష్యంగా డీసీసీబీ ఛైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ కోడలు హారిక పెడన జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు.
- విజయనగరం జిల్లా మెరకముడిదాం జడ్పీటీసీ పదవికి పోటీచేసిన మజ్జి శ్రీనివాస్.. మంత్రి బొత్స మేనల్లుడు. ఇక్కడ తెదేపా నుంచి నామినేషన్ వేసిన మహిళ తర్వాత వైకాపాలో చేరడంతో శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీ పీఠంపై గురిపెట్టినట్లు సమాచారం.
- అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైకాపా) కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి మున్సిపాలిటీ ముఖ్యస్థానమే లక్ష్యంగా కౌన్సిలర్ స్థానానికి బరిలో దిగారు. ఇదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన న్యాయవాదుల ద్వారా నామినేషన్ దాఖలు చేయించారు.