గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో రాజధాని నిర్ణయించిన సమయంలో అక్కడి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం ఉండేది. రాజధాని ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టినా... ఆ తర్వాత భూసమీకరణ, భూముల అభివృద్ధి, రైతులకు ప్లాట్లు కేటాయింపు ఇలా ఎన్నో దశలు. అన్ని సమయాల్లోనూ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరిగేవి. రిజిస్ట్రేషన్ల కోసం తుళ్లూరులో కార్యాలయం లేక అమరావతి, మంగళగిరి, తాడికొండ వెళ్లాల్సి వచ్చేది. అప్పటి డిమాండ్‌ని బట్టి ప్రభుత్వం తుళ్లూరులో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, అనంతవరం, మందడం, ఉండవల్లి ప్రాంతాల్లోనూ 2015లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేసింది.
భూసమీకరణకు పొలాలు ఇచ్చిన రైతులకు... వారి వాటాగా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించే వరకూ ఈ లావాదేవీలు బాగానే నడిచాయి. తమ వాటాగా వచ్చిన ప్లాట్లను పిల్లల చదువులు, వివాహాల కోసం కొందరు అమ్ముకున్నారు. ఇలా 2019 వరకూ అంతా బాగానే ఉంది. ప్రభుత్వం మారటం, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు నిలిచిపోగా అక్కడి ప్లాట్ల క్రయవిక్రయాలూ మందగించాయి. ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత అమరావతిలో ఆందోళనలు, ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణకు ముందుకెళ్లటం అన్నీ గత 8 నెలలుగా జరిగిపోయాయి.