ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరింత పొడవుగా ఆర్‌ఆర్‌ఆర్‌... దక్షిణ భాగానికి త్వరలో జాతీయ హోదా - ఆర్‌ఆర్‌ఆర్‌

Regional Ring Road in Hyderabad: హైదరాబాద్‌లో ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగ రహదారి విస్తీర్ణం పెరిగింది. ఈ మార్గం సుమారు 190 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నది ప్రాథమికంగా అంచనా వేశారు. రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగం రహదారికి త్వరలో జాతీయ రహదారి నంబరును కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నంబరు కేటాయించాకే రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

Regional Ring Road
హైదరాబాద్‌లో ప్రాంతీయ రింగు రోడ్డు

By

Published : Oct 15, 2022, 4:21 PM IST

Regional Ring Road in Hyderabad: హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌) అవతల నుంచి ప్రతిపాదించిన ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగ రహదారి విస్తీర్ణం పెరిగింది. ఈ మార్గం సుమారు 190 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నది ప్రాథమిక అంచనా. రహదారి సవివర నివేదిక రూపొందించే బాధ్యతలను ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ లిమిటెడ్‌(దిల్లీ) సంస్థకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అప్పగించింది. ప్రాథమిక అధ్యయనాన్ని పూర్తిచేసిన ఆ సంస్థ.. నివేదికను కేంద్ర మంత్రిత్వశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. సవివర నివేదిక(డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్‌) రూపొందించే పనిలో అది ఉంది. రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను రెండు భాగాలుగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 158.645 కిలోమీటర్ల ఉత్తర భాగంలో సుమారు 4,200 ఎకరాల మేర భూసేకరణ సర్వే కొన్ని ప్రాంతాల్లో చివరి దశలో ఉంది. దక్షిణ భాగం అధ్యయనం సాగుతోంది. ఉత్తర భాగానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్రం నంబరు కేటాయించింది.

త్వరలో జాతీయ రహదారి హోదా:దక్షిణ భాగం రహదారికి త్వరలో జాతీయ రహదారి నంబరును కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నంబరు కేటాయించాకే రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. రహదారి అలైన్‌మెంటు ఖరారుతో పాటు నివేదిక సిద్ధం చేసేందుకు కనీసం రెండు నెలలు పడుతుందన్నది సమాచారం. మూడు రకాలుగా ఈ మార్గ నివేదికలను కన్సల్టెన్సీ సంస్థ రూపొందిస్తుంది. వాటి నుంచి ఓ నివేదికను కేంద్రం ఆమోదిస్తుంది. తరవాత భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. దక్షిణ భాగం కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్‌, షాద్‌నగర్‌, అమనగల్‌, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌ మీదుగా ఉత్తర భాగంలోని చౌటుప్పల్‌లో కలుస్తుంది. ఈ రహదారి రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి వెళుతుంది. ఈ మార్గంలో సుమారు అయిదువేల ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా. ఇక్కడ అమనగల్‌ ప్రాంతంలో క్రూరమృగాల సంచారం లేని రిజర్వు ఫారెస్టు సహా ప్రభుత్వ భూములే ఎక్కువగా ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.

చెరువులు, కాల్వల గుర్తింపునకు దక్షిణ భాగంలో జలవనరులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించే పనిలో కన్సల్టెన్సీ సంస్థ ఉంది. ఈ మార్గంలో చెరువులు, కాల్వలు ఉంటే సంబంధిత మ్యాపులు అందజేయాల్సిందిగా కోరుతూ నీటిపారుదల శాఖకు అది లేఖ రాసింది. అవి అందాక మరోసారి ఆ మార్గాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక నివేదికపై కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో వివరించినట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతిపాదన దశలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో దక్షిణ భాగం రహదారి విస్తీర్ణం 182 కిలోమీటర్లుగా ఉంది. తాజా అధ్యయనంలో అది 190 కిలోమీటర్లకు చేరింది. భూసేకరణ అంచనా కూడా స్వల్పంగా పెరిగినట్లు అంచనావేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details