తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో 12, 635 ఎకరాల్లో.. సుమారు 4వేల కోట్లతో నిమ్జ్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా.. సంగారెడ్డిలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాట్లు చేసింది.
కరోనా నేపథ్యంలో.. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ... నాయల్కల్ మండలంలోని మామిడ్జి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు... హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ సేన్‌రెడ్డి ధర్మాసనం... వారి పిటిషన్‌పై విచారణ జరిపింది.
ప్రభుత్వ వివరణ ఇలా..
ప్రతిష్ఠాత్మక నిమ్జ్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయని... ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రక్రియ నిలిచిపోతే ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
చైనాలో కరోనా పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. కాబట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఏజీ వాదించారు. కరోనా పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు ఇప్పటికే చాలా ముందుకు వెళ్లాయని వివరించారు.