ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు - Reduced registrations

కరోనా ప్రభావం, మూడురాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు 11,50,582 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల జరగ్గా.. వీటి విలువ రూ.3,312.95 కోట్లు. ఈ ఏడాది ఇదే కాలానికి రిజిస్ట్రేషన్ల సంఖ్య 10,12,150కు తగ్గగా వీటి విలువ రూ.3,031.98 కోట్లుగా నమోదైంది.

రాష్ట్రంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు

By

Published : Dec 8, 2020, 6:57 AM IST

కరోనా ప్రభావం, మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు 11,50,582 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల జరగ్గా.. వీటి విలువ రూ.3,312.95 కోట్లు. ఈ ఏడాది ఇదే కాలానికి రిజిస్ట్రేషన్ల సంఖ్య 10,12,150కు తగ్గగా వీటి విలువ రూ.3,031.98 కోట్లుగా నమోదైంది. కిందటేడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లు 1,38,432 (-12.03%) తగ్గగా ప్రభుత్వానికి ఆదాయం పరంగా 8.48% పడిపోయింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లో తగ్గుదల భారీగా ఉంది. కేవలం కర్నూలు జిల్లాలో స్వల్పంగా పెరగ్గా.. విజయనగరంలో అనూహ్యంగా 13 శాతానికి మించి నమోదైంది. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టినా ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపేవారు తగ్గారు. దీనికి కరోనా తోడవ్వడంతో నిర్మాణ రంగంలో లావాదేవీలు మందగించాయి. బిల్డర్లు ఫ్లాట్ల ధరలను గతంలో చెప్పిన దానికంటే తగ్గించి అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందున పొరుగునే ఉన్న విజయనగరంపై ఆ ప్రభావం కన్పిస్తోంది. అక్కడ భూముల క్రయవిక్రయాలు పెరిగినట్లు రిజిస్ట్రేషన్ల సంఖ్యను బట్టి తెలుస్తోంది.

విలువ పెంపుతో కాస్త మెరుగు
* ఈ ఏడాది ఆగస్టు నుంచి భూముల మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచింది. ఫలితంగా ఆదాయం పరంగా ఆగస్టు నుంచే రాబడి పెరిగింది.
* విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
* గతేడాది ఏప్రిల్‌లో రూ.330.90 కోట్ల రాబడి రాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.183 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
* గత మేలో రూ.409.34 కోట్లు రాగా సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉన్న ఈసారి మేలో రూ.179.07 కోట్లకు పడిపోయింది.
* కిందటేడాది ఆగస్టులో రూ.365.01 కోట్లు ఆదాయం రాగా గత ఆగస్టులో రూ.449.15 కోట్లు వచ్చింది.
* భూముల మార్కెట్‌ విలువ పెంచిన ఫలితం ఇక్కడ కన్పిస్తోంది.
* నవంబరులోనూ గతేడాది (రూ.413.85 కోట్లు)కి..ఈ ఏడాది (రూ.530.98)కి హెచ్చుదల నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details