Red ant egg pickle : ఎర్ర చీమలు అంటేనే అవి కుడతాయని, అవి కుడితే చర్మంపై మంటలతో బొబ్బలు ఎక్కుతాయని మనకు తెలిసిందే. అందుకే ఎర్ర చీమలు కనబడితే వాటిన దూరంగా నెట్టేస్తాం. లేదా దూరంగా పారిపోతాం. కానీ గిరిజనులు మాత్రం ఎర్ర చీమలను వెంటాడి వేటాడి పట్టుకొని వాటి గూడులోని చీమల గుడ్లను సేకరించి పచ్చడి చేసుకుని ఇష్టంగా ఆరగిస్తారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం మండలాలు, తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఎండాకాలం వచ్చిందంటే ఎర్ర చీమల గుడ్లను సేకరించి పచ్చడి చేసుకుని తింటారు. సంతల్లో కూడా వీటిని విక్రయిస్తుంటారు. ముందు అడవుల్లోకి వెళ్లి పెద్ద పెద్ద చెట్ల చివర భాగాల్లో ఎర్ర చీమలు ఆకులతో పెట్టుకున్న గూడును కర్రలతో కొట్టి కింద పడేస్తారు. ఒకవైపు చీమలు కరుస్తున్నా.. పట్టించుకోకుండా ఆ గూడులోని ఎర్ర చీమలను బయటకు తీసేసి చీమల గుడ్లను సేకరిస్తారు.