తెలంగాణలో భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ సోమ, మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని లెక్కకట్టింది. రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉద్ధృతి నమూనాలను పలుమార్లు పరిశీలించి ఈ మేరకు అంచనా వేస్తోంది. దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో 35 సెం.మీ. దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ కె.నాగరత్న 'ఈనాడు'కు వివరించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో చరిత్రలోనే జులై నెలలో అత్యంత భారీ వర్షం నమోదైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతోపాటు రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడ్డాయి. 20 ప్రాంతాల్లో అతి భారీ వర్షం, 56 ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవ్వడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 344 ప్రాంతాల్లో సెంటీమీటరు నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షం కురుస్తూనే ఉంది. కొన్నిచోట్ల ముసురు పట్టినట్లు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తూ కొంత సమయం తెరిపి ఇచ్చాయి.
జిల్లాల్లో పరిస్థితి ఇలా..
నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కిషన్రావుపేట్, ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలోని పన్నీర్ చెరువులకు గండి పడటంతో నీరు బయటకు పోయింది. ముథోల్ మండలంలో ఓని- బాసర రహదారి, లోకేశ్వరం-పేండ్పెల్లి గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట, తుంపల్లి, వట్టవాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోటపల్లి మండలం లక్ష్మిపూర్ వద్ద వరదనీటిని మళ్లించేందుకు 63వ జాతీయ రహదారిని తవ్వడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచాయి.
- జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ వద్ద భారీ వృక్షం నేలకూలింది. సమీపంలోనే అనంతారం వాగు పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో నేరెళ్ల వద్ద రహదారి జలమయమైంది.
- పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ రేకుల షెడ్డుపై భారీ వృక్షం కూలింది. రాయికల్ పట్టణ శివారులో బతుకమ్మ వాగులో గూడ్స్ ఆటో బోల్తాపడింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా.. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు.
- ములుగు జిల్లా శనిగకుంటలో చప్టాపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
- భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో వాగుల ఉద్ధృతితో 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దంపేట వాగు ప్రవాహంతో రోడ్డు తెగిపోయి పలిమెల మండలానికి రాకపోకలు బంద్ అయ్యాయి.
చేపల వరద అలా.. అడ్డుగా జాలీ ఇలా..
మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవుపేటలోని జంగల్నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరి మత్తడి పారుతోంది. ఈ నీటిలో చేపలు భారీగా బయటికి వస్తున్నాయి. వీటిని పట్టుకునేందుకు జాలర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఇనుప జాలీల్లో చిక్కుకుపోయి ఇలా కనిపించాయి.