Recruitment process Faster for Govt Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అయ్యింది. దానికోసం ఇప్పటికే సర్కార్ ప్రణాళికలు రచిస్తుండగా... ఉద్యోగాల భర్తీ పూర్తి చేసేందుకు నియామక సంస్థలు వివిధ మార్గాలను పరిశీలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్ పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తున్నాయి. భారీ సంఖ్యలో అభ్యర్థులున్నప్పుడు కంప్యూటరైజ్డ్ పరీక్షల నిర్వహణతో వేగంగా మూల్యాంకనంతో పాటు డబుల్ బబ్లింగ్ తదితర సాంకేతిక సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నాయి. పరీక్షలను సకాలంలో నిర్వహించడంతో పాటు గడువులోగా నియామకాలను పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఇతర పీఎస్సీలతో పాటు విద్యాసంస్థల్లో ప్రవేశ కమిటీలు అమలు చేస్తున్న పరీక్షల విధానాన్ని పరిశీలిస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుంటే 50 వేలకు మించకుండా హాజరయ్యే వాటికి విడతల వారీగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుంది. ఒకవేళ అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రస్తుతానికి పాత విధానాన్నే అమలు చేయాలనే యోచనలో నియామక సంస్థలున్నాయి. ఉద్యోగ క్యాలెండర్ అమలయ్యేటప్పుడు కొత్త విధానంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నాయి.
కంప్యూటరైజ్డ్ పరీక్షతో..ఏదైనా పరీక్షకు 50 వేల మందిలోపు అభ్యర్థులుంటే కంప్యూటరైజ్డ్ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇతర నియామక సంస్థలూ దీన్ని పరిశీలిస్తున్నాయి. ప్రైవేట్ పరీక్ష కేంద్రాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 వేల మందికి మించి నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. గ్రూప్-1, 2, 3, 4తో పాటు పోలీస్ నియామక బోర్డు పరిధిలోని పరీక్షలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే అవకాశముంది. ప్రశ్నపత్రాల ముద్రణ, పంపిణీలో ఇబ్బందులు లేనప్పటికీ.. గతంలో డబుల్ బబ్లింగ్, ప్రశ్నపత్రాల కోడ్(ఏ, బీ, సీ, డీ)లను తప్పుగా నమోదు చేయడం తదితర కారణాలతో గ్రూప్-2 పోస్టులపై న్యాయవివాదం నెలకొని ఫలితాలు ఆలస్యమయ్యాయి. 2016లో పరీక్ష జరగగా.. 2020లో నియామకాలు చేపట్టారు. ఈ తరహా జాప్యాన్ని కంప్యూటరైజ్డ్ విధానంతో అధిగమించవచ్చని కొన్ని నియామక సంస్థలు భావిస్తున్నాయి.