హైదరాబాద్ నగరవాసులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మాదిరి భాగ్యనగరంలో కొద్దిరోజులుగా ఉక్కపోత అధికమైంది. పగలు రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జులైలో భారీ నుంచి అతి భారీగా రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆ తర్వాత సాధారణ వర్షపాతం కూడా కరవైంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో కరెంట్ వినియోగం వానాకాలంలో ఇదివరకు ఎప్పుడు లేనంత అధికంగా నమోదవుతోంది. ఈ సీజన్‌లో మంగళవారం గరిష్ఠ వినియోగం రికార్డయ్యింది. గతేడాది ఆగస్టు 5 నుంచి 10వ తేదీ మధ్య గరిష్ఠ వినియోగం 44.2 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే కాలంలో గరిష్ఠం 58.78 మిలియన్ యూనిట్లపైన కరెంట్ వినియోగం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు అధికంగా ఉన్నాయి. పగటిపూట గరిష్ఠంగా 34 డిగ్రీల వరకు, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
వేసవి స్థాయిలో..
ఈ ఏడాది వేసవిలో పెద్దగా ఎండలు లేకపోవడం, లాక్‌డౌన్ కూడా తోడవడంతో కరెంట్ వినియోగమూ పెరగలేదు. వేసవిలో ఒక్కరోజు గరిష్ఠ వినియోగం 60 మిలియన్ యూనిట్ల లోపే ఉంది. ప్రస్తుత వానాకాలంలో నగరంలో దాదాపు ఆ స్థాయిలో వినియోగం ఉంది. మంగళవారం రోజు 58.78 మిలియన్ యూనిట్ల వరకు నమోదైంది. విద్యుత్తు డిమాండ్ వేసవిలో 2800 మెగావాట్లు ఉంటే.. ప్రస్తుతం 2746 మెగావాట్ల వరకు ఉంది. వానలు పడకపోతే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్తు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.