నగర, పురపాలికల ఎన్నికల్లో అధికార వైకాపాలో ఇంటి పోరు తప్పడం లేదు. టికెట్ ఆశించి దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా పలువురు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల విభేదాలతో తమ అనుయాయులకు పార్టీ బి.ఫారాలు రాకపోవడంతో వారిని కొందరు నాయకులే స్వతంత్రులుగా పోటీలో కొనసాగిస్తున్నారు. కడప నగర పాలక సంస్థలో 3 డివిజన్లలోనే 10 మంది, విశాఖపట్నం నగరపాలక సంస్థలో ముగ్గురు తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. కొందరిని సంప్రదింపులతో పోటీ నుంచి విరమింపజేయించినా కొన్ని చోట్ల రెబల్స్ కొనసాగుతున్నారు.
కడప జిల్లా బద్వేలులో 25 స్థానాల్లోనూ, ప్రొద్దుటూరులో 20 మంది వరకు, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలో 25 మంది, చీరాలలో 28 మంది, అనంతపురం జిల్లా హిందూపురంలో 15 మంది రంగంలో ఉన్నారు. తాడిపత్రిలోని ఒక వార్డులో అధికార, తిరుగుబాటు అభ్యర్థి నడుమే పోటీ జరుగుతోంది. గుంతకల్లు, మడకశిరలో నలుగురి చొప్పున, కృష్ణా జిల్లా విజయవాడ నగర పాలక సంస్థలో ఇద్దరు, నందిగామలో ముగ్గురు, తిరువూరు, ఉయ్యూరులో ఒక్కొక్కరి చొప్పున పోటీలో ఉన్నారు.