ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆడ బిడ్డలపై దారుణాలకు కారణమిదే.. తల్లిదండ్రులూ జాగ్రత్త! - latest news of child harrassments

కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎప్పుడు ఏ మగాడు మృగాడిగా మారిపోతాడో.. ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలేంటో మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

child harassment cases
child harassment cases

By

Published : Oct 14, 2021, 1:48 PM IST

కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు అమలు చేసినా చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వచ్చిన పసిపిల్లలకు, చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లిన చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. కొందరు మృగాళ్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చాలా కేసుల్లో తెలిసిన వారే నమ్మించి బలి తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిపై సినిమాల్లో అశ్లీలత, మాదకద్రవ్యాలు, చైల్డ్‌ పోర్నోగ్రఫీ, స్మార్ట్‌ఫోన్‌ వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి..
ఆరుబయట ఆడుకునే పిల్లలు, బడికి వెళ్లే చిన్నారులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరి పనిలో వారు నిమగ్నం కాకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వివరించాలి. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలి. దగ్గర బంధువులైనా సరే ప్రవర్తనలో తేడాగా కనిపిస్తే గట్టిగా హెచ్చరించాలి. చాలామంది మత్తులో ఉన్మాదులుగా మారుతున్నారు. అలాంటి వారిని వీలైనంత దూరంగా పెట్టడం మంచిది.

స్మార్ట్‌ఫోన్లతో ప్రమాదం..
పదేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. విచ్చలవిడి ఇంటర్నెట్‌ కారణంగా చాలామంది అశ్లీలతకు అలవాటు పడుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొంతమంది చెడువైపు ఆకర్షితులై పెడదోవ పడుతున్నారు. పోర్నోగ్రఫీ ప్రభావంతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీనిపట్ల చిన్నారుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వీధుల్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్న వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఏమాత్రం అనుమానం కలిగినా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్తమం. ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా అందరి చేతుల్లోకి మొబైల్‌ ఫోన్స్‌ వచ్చేశాయి. ఫోన్లలో యూట్యూబ్‌, అనవసర బ్రౌజర్లు వాడకుండా లాక్‌ చేయడం మంచిది. చిన్నారులకు ఫోన్‌ ఏ మేరకు అవసరమో వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

ఫిర్యాదు చేస్తేనే..
బాలికలపై లైంగిక దాడికి పాల్పడితే నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్ష విధిస్తారు. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అయితే.. పరువు పోతుందనే భయంతో చాలామంది కేసు పెట్టడానికి ముందుకు రావడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఇలాంటి వాటిని అరికట్టవచ్ఛు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

  • రాప్తాడు నియోజకవర్గంలోని ఓ మండలంలో 55 ఏళ్ల వ్యక్తి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను మోసం చేసి గర్భవతిని చేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అమ్మాయి గర్భం దాల్చి ఆడపాపకు జన్మనిచ్చింది. చివరికి బాధితుల ఫిర్యాదు మేరకు మృగాడిని జైలుకు పంపారు.
  • తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో తన అక్కను చూడటానికి వచ్చిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.
  • తాడిపత్రి నియోజకవర్గానికే చెందిన మరో గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు స్నానాలగదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.
  • బుక్కపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నగరపాలక ఉద్యోగి.. నయవంచన!
అనంత నేరవార్తలు: అతనో ప్రభుత్వ ఉద్యోగి.. వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేస్తాడు.. పిల్లలు, యువతకు తన అనుభవాలతో ఆదర్శంగా నిలవాల్సిన ఆయన ఆడపిల్లలపై అరాచకాలకు పాల్పడ్డాడు. మానవత్వం మంటగలిసేలా ప్రవర్తించాడు. బాలికల జీవితాలతో ఆడుకున్నాడు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు వివరాల మేరకు.. అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేసే కుంతురు మాధవరెడ్డి కళాశాలల అమ్మాయిలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి మాయమాటలతో తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని, ఫోన్‌ నంబరు ఇస్తూ.. తానొక శ్రీమంతుడిలా నమ్మించాడు. పలువురి ఆర్థిక అవసరాలు తీరుస్తూ.. క్రమంగా శారీరకంగా దగ్గరయ్యాడు. మరోవైపు బ్రోకర్‌గా మారి తనకు పరిచయం ఉన్న, డబ్బున్న వ్యక్తులకు ఎరగా వేశాడు. ఇలా పలువురు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. 13 ఏళ్ల కిందట ఓ లాడ్జిలో ఇద్దరు మహిళలతో వ్యభిచారం చేసిన కేసు నమోదైంది. ఉద్యోగ విరమణ వయసులో ఉన్న నిందితుడిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో దిశ స్టేషన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జిల్లా కోర్టులో హాజరు పరచగా నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో జిల్లా కారాగారానికి తరలించారు. ఇలాంటి వారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు.. తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. గతంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. బంధాలు, విలువల గురించి పెద్దలు చెప్పేవారు. సమాజంపై అవగాహన ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్‌లు వికృత పోకడలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు వాటిని గమనించడంలో విఫలమవుతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. - శ్రీనివాసులు, డీఎస్పీ, దిశ

ఇదీ చదవండి:Husband Harassment: భార్య వేలు కట్​ చేసి భర్త పారిపోయాడు.. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details