రాష్ట్రంలో ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ తెదేపా పట్టు కోల్పోయినట్టు కనిపించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంత మేలు చేశామని అధినేత చంద్రబాబు పదేపదే చెప్పినా.. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో సైకిల్ హవా కనిపించలేదు. తెదేపా ఎమ్మెల్యేలున్న చాలా నియోజకవర్గాల్లోనూ వ్యతిరేక తీర్పులు వచ్చాయి.
స్థానిక నాయకత్వం పట్టు కోల్పోయిందా..?
స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం స్థానిక నాయకత్వమే కీలకం. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కువచోట స్థానిక నాయకత్వం చేతులెత్తేసింది. తెదేపాలో మంత్రులు, ఇతర హోదాల్లో పనిచేసిన వారు కూడా చురుగ్గా పోరాడలేకపోయారు. మొదటి నుంచీ ఎన్నికల్లో వైకాపా దూకుడుగానే వ్యవహరించింది. అధికార పక్షంగా.. అధికార వర్గాల నుంచి వచ్చిన అండదండలతో పాటు.. అన్నిచోట్లా దాదాపు వారి ప్రజాప్రతినిధులే ఉండటంతో.. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయగలిగారు. తెదేపాలో నియోజకవర్గస్థాయి ఇన్ఛార్జులుగా ఉన్నవారు దీనిని సరిగ్గా ఎదుర్కోలేకపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో 100శాతం ఏకగ్రీవాలు జరుగుతున్నా.. అడ్డుకోలేని పరిస్థితి. మెజార్టీ స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో వార్డులను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా వైకాపా ముందుగానే విజయాన్ని ఖాయం చేసుకుంది.
అధిపత్య పోరు...
తెలుగుదేశం ఆశలు పెట్టుకున్న స్థానాల్లో కూడా అధిపత్య పోరు దెబ్బతీసింది. ఈ కారణంగానే విజయవాడలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బెజవాడ కార్పొరేషన్‌లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందు రోజే బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్ మీరా... స్థానిక ఎంపీ కేశినేనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు కొన్నిరోజుల ముందు జరిగిన ఘటన స్థానిక నాయకత్వంలో అనైక్యత ఎంత ఉందో చాటింది. ఒక్క విజయవాడకే ఇది పరిమితం కాలేదు. చాలాచోట్ల జరిగింది.