ఎవరైనా తమ దగ్గర డబ్బులుంటే స్థలమో, ఓ ఇల్లో, ఫ్లాటో కొనుక్కోవాలి అనుకుంటారు.. అందులో పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని మరికొందరు ఆలోచిస్తారు. ఇదే అవకాశంగా స్థిరాస్తి వ్యాపారం మాటున కొందరు మోసాలకు తెగబడుతున్నారు. లేని భూమి ఉన్నట్లు చూపించి అమ్మేయటం, ఒకరితో ఒప్పందం చేసుకుని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయటం, వెంచర్ల పేరిట డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేయటం వంటి నేరాలకు పాల్పడుతున్నారు.
మోసం-1 : లేని భూమి ఉన్నట్లు చూపించి
సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్య, మధ్యతరగతి వారి ఆశే వారికి పెట్టుబడి. ఎక్కడా స్థలాలు లేకపోయినా, కాగితాలపై మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. భారీ స్థాయిలో వెంచర్లు వేస్తామని నమ్మిస్తారు. వందల మంది నుంచి అడ్వాన్సులు తీసుకుని ఆపై బోర్డు తిప్పేస్తారు. ఈ తరహా మోసాలు ఇటీవల బాగా పెరిగాయి.
*విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎంకే కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ సంస్థ.. ఆగిరిపల్లి, ముస్తాబాద, గన్నవరం, గుండిమెడ, ఉదయగిరి, కనిగిరి తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేస్తామని ప్రకటించింది. ముందుగా డబ్బు కట్టినవారికి తక్కువ ధరలకే ఇల్లు కట్టించి ఇస్తామని రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పటమట పోలీసుస్టేషన్‌లో ఈ సంస్థ ప్రతినిధులపై కేసు నమోదైంది.
మోసం-2: ఒప్పందం ఒకరితో.. రిజిస్ట్రేషన్ మరొకరికి
డెవలప్‌మెంట్ పేరిట ఒకరి వద్ద స్థలం తీసుకుని అపార్ట్‌మెంట్ కడతారు. నిర్మాణ సమయంలోనే ఫ్లాట్లను అమ్మకానికి పెట్టి, అడ్వాన్సులు తీసుకుంటారు. చివరిలో వాటినే వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసి.. ముందుగా అడ్వాన్సు ఇచ్చిన వారిని మోసగిస్తారు. భూ యజమానికి వాటా కింద ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా వేరేవాళ్లకు అమ్మేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఇలా మోసగించిన నలుగురు స్థిరాస్తి వ్యాపారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
మోసం-3: ఫ్లాట్లు విక్రయిస్తామంటూ వసూళ్లు..ఆపై కుచ్చుటోపీ
గుంటూరు నగరానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి పెదపరిమిలో వెంచర్ వేశానని, అందులో ప్లాట్లు అమ్ముతానని దాదాపు 300 మంది నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశారు. ప్లాట్లు రిజిస్టర్ చేయాలని బాధితులు అడుగుతుంటే పరారయ్యారు. రూ.50 కోట్ల వరకు వసూలు చేసి, మోసగించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. విశాఖపట్నం, విజయవాడ సహా పలు నగరాల్లో గతంలోనూ ఇలాంటి ఉదంతాలు నమోదయ్యాయి.
మోసం-4: మీకు తెలియకుండానే మీ భూమి అమ్మకం
అమెరికాలోని ఓ ప్రవాసాంధ్రుడు విశాఖకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి కొన్నేళ్ల కిందట కొంత భూమి విక్రయించాడు. ఆ లావాదేవీల సమయంలో ప్రవాసాంధ్రుడికి కొమ్మాదిలో 12 ఎకరాల భూమి ఉందని స్థిరాస్తి వ్యాపారి తెలుసుకున్నాడు. ఆ భూమికి తన పేరిట నకిలీ జీపీఏ, స్పెషల్ జీపీఏ పత్రాలు తయారు చేయించాడు. వాటి ఆధారంగా ఆ భూమిని రూ.18.7 కోట్లకు విక్రయించేందుకు ఓ పెద్ద స్థిరాస్తి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు కూడా తీసేసుకున్నాడు. స్థిరాస్తి సంస్థ ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పత్రికా ప్రకటన ఇవ్వడంతో మోసం బయటపడింది. ఇలాంటి మోసాలు అనేకం వెలుగుచూస్తున్నాయి.