ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెను సంక్షోభం... అయినా కోలుకునే అవకాశం

కరోనా సమస్యతో ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైరస్‌ ఉద్ధృతి తగ్గగానే తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం కుటుంబాల నుంచి పరిశ్రమల వరకు అన్నింటినీ ఆదుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుల విషయంలో ఓ పరిమితికి లోబడి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

By

Published : Apr 23, 2020, 5:51 AM IST

పెను సంక్షోభం... అయినా కోలుకునే అవకాశం
పెను సంక్షోభం... అయినా కోలుకునే అవకాశం

కొవిడ్‌-19 ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రత్యేకించి దేశం మీద ఎలా ఉంటుందంటారు?

ఈ సంక్షోభం చాలా లోతైంది, తీవ్రమైందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ప్రపంచంపై 2008 ఆర్థిక సంక్షోభం కంటే ఎక్కువ ప్రభావం చూపనుంది. ఇది ఆర్థికవ్యవస్థ బయటి నుంచి వచ్చిన సంక్షోభం. గతంలో డిమాండ్‌ పెరగడానికి, సరఫరా చేయడానికి దోహదపడే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీరేట్లు తగ్గించడం, లిక్విడిటీ పెంచడం లాంటి చర్యలు తీసుకున్నా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగలేదు.

కరోనాకు ముందు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ అంత మెరుగ్గా లేదు. జీడీపీ వృద్ధిరేటు 2019-20 మూడవ త్రైమాసికంలో ఐదు శాతం లోపే.. నాలుగో త్రైమాసికంలో ఇంకా అధ్వానం.ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీయొచ్చు?

ఐఎంఎఫ్‌ ప్రకారం వృద్ధిరేటు 4.2 శాతమే. అదే తక్కువ. ఇప్పుడు 1.9 శాతం ఉంటుందంటున్నారు. ఇది కూడా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఊహించి చెప్పడమే. ధనిక, పేద దేశాలన్నింటిలోనూ వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లినప్పుడు మనది 1.9 శాతం ఉండటం కొంచెం నయంగానే ఉంది. కానీ ఇది గొప్పలు చెప్పుకొనే సమయం కాదు. మన దేశంలో పేదరికం ఎక్కువ. కాబట్టి దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోవడం, అప్పులు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం లేకపోవడం లాంటి వాటివల్ల మన ఆర్థిక వ్యవస్థ చాలా ఒత్తిడిలో ఉంది. అలాంటి సమయంలో ఈ సంక్షోభం వచ్చింది. ఇప్పుడు మనం గమనించాల్సిందేమిటంటే పెట్టుబడి (కేపిటల్‌) ధ్వంసం కాలేదు. భూకంపం, తుపాన్లు వచ్చాయంటే పునర్నిర్మాణానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి ఉండదు. కాబట్టి కరోనా తగ్గగానే కోలుకోవడానికి అవకాశం ఉంది.

ఎన్నో దేశాలు ఇప్పుడు ఆర్థిక ప్యాకేజీలిస్తున్నాయి. మనదేశం కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ప్యాకేజీలు ఏమేరకు ఫలితాలిస్తాయంటారు?

మనదేశంలో దాదాపు 83 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు జీవనోపాధి పోయింది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి, జీడీపీలో 0.8 శాతానికి సమానమైన ఒక ప్యాకేజీని ప్రకటించారు. కాకపోతే ఇతర దేశాలతో పోల్చితే లేదా మనదేశంలో ఉన్న పరిస్థితి తీవ్రత దృష్ట్యా అది సరిపోదు. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవు. ఇప్పటికే ఆర్థిక లోటు ఎక్కువగా ఉంది. ప్రస్తుత ‘లాక్‌డౌన్‌’ వల్ల పన్ను ఆదాయం కూడా తగ్గి.. లోటు ఇంకా పెరిగిపోతుంది. కరోనా వైరస్‌ వ్యాధి విస్తరించక ముందు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న లోటు బడ్జెట్‌ ప్రకారం జీడీపీలో 6.5 శాతం. ఇప్పుడు లోటు 10 శాతం కూడా మించిపోయే ప్రమాదం ఉంది. అది చాలా ఎక్కువ. దానిపై ప్యాకేజీ ఇవ్వాలంటే, ప్రభుత్వం ఇంకా అప్పులు చేయాలి. ఎంత అప్పు చేయాలనేది ముందుగా నిర్ణయించుకొని దాని ప్రకారం వ్యవహరించాలి. ‘కరోనా రిలీఫ్‌’ కోసం జీడీపీలో అదనంగా 2- 2.5 శాతం వరకూ అప్పులు చేద్దామనుకుంటే.. అందుకనుగుణంగా ఖర్చులు చేయాలి. అలా చేసినా సమస్యలుంటాయి. అప్పులు పెరిగినందున మనదేశం రేటింగ్‌ ‘డౌన్‌గ్రేడ్‌’ కావచ్చు. అదే జరిగితే విదేశీ మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. అప్పుడు ‘ఎక్స్ఛేంజి రేటు’ సమస్య తలెత్తుతుంది. ద్రవ్యోల్బణం పెరగొచ్చు. ‘ప్రస్తుత అవసరాల కోసం కొంత అప్పులు చేస్తున్నాం, ఈ అప్పులు రెండు, మూడేళ్లలో తీర్చేస్తాం’అని కేంద్ర ప్రకటించాలి. అప్పుడు మార్కెట్లో విశ్వాసం వస్తుంది. అప్పుల విషయంలో ఇష్టానుసారంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఎలాంటి సవాళ్లను ముందుగా చేపట్టాలి?

రిజర్వ్‌బ్యాంకు మారటోరియం విధించడం, లిక్విడిటీని పెంచడం, వడ్డీరేట్లు తగ్గించడం లాంటివి చేసినా సరిపోదు. గృహనిర్మాణ రంగం, ఇతర పరిశ్రమలను ఆదుకోవాలి. ప్రభుత్వం పెద్ద కంపెనీలకు బకాయిలు చెల్లించాలి. ఈ కంపెనీలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సక్రమ చెల్లింపులు చేసేలా చూడాలి. దీని వల్ల డబ్బు ఉత్పత్తి అవుతుంది. ఇందుకు అప్పులు అవసరం. రిజర్వ్‌బ్యాంకు వడ్డీలు తగ్గించినా ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంకులు రుణాలివ్వడానికి వెనుకంజవేస్తాయి. ప్రభుత్వం ఈ అప్పులకు గ్యారంటీ ఇవ్వాలి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు వీరిని ఆదుకోవడానికి అమెరికా ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి సపోర్టును ప్రభుత్వమివ్వాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీ వంటి ఆర్థిక విధానాలను అనుసరించాలని కొందరు సూచిస్తున్నారు. ఎంతవరకూ అనుసరణీయం?

మనం ఇంకా అంత దూరం వరకూ రాలేదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ విధానాలను అనుసరించారు. అన్ని దేశాల్లో కేంద్ర బ్యాంకులు (మనదేశంలో రిజర్వు బ్యాంకు మాదిరిగా) నగదు లభ్యత తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాయి. బ్యాంకులు, మూచ్యువల్‌ ఫండ్లు... వంటి సంస్థల వద్ద ప్రభుత్వ బాండ్లు ఉంటాయి. వీటిని కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసి వ్యవస్థలో నగదు లభ్యత పెరిగేలా చర్యలు తీసుకుంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో బాండ్లను ఎంతగా కొన్నప్పటికీ నగదు లభ్యత సరిపోలేదు. అప్పుడు కార్పొరేట్‌ బాండ్లు, మార్ట్‌గేజ్‌, ఇతర సెక్యూరిటీలు కూడా కొనటానికి సిద్ధపడాల్సి వచ్చింది. అది అసాధారణ చర్య. మనదేశ విషయానికొస్తే రిజర్వుబ్యాంకు చట్టం ప్రకారం ప్రభుత్వబాండ్లు తప్ప, ఇతర రకాలైన బాండ్లు కొనే అధికారం ఆర్‌బీఐకి లేదు. అవసరమైతే చట్టాలను సవరించవచ్చు. తద్వారా నగదు లభ్యతను విపరీతంగా పెంచొచ్చు. కానీ మనకు ఇంకా అంత అవసరం రాలేదు. ఇక ‘హెలికాప్ట్టర్‌ మనీ’ ఏమిటంటే.. ఈ పద్ధతిలో కేంద్ర బ్యాంకులు కొత్తగా నగదు ముద్రించి ప్రభుత్వానికి ఇస్తాయి. అది అప్పు కాదు. ప్రభుత్వం ఆ సొమ్మును రకరకాల పథకాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తుంది. ప్రజలు ఆ సొమ్మును ఖర్చు చేస్తే, వ్యయం పెరిగి, వస్తుసేవలకు గిరాకీ లభించి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’కు, ‘హెలికాప్టర్‌ మనీ’ విధానానికి స్పష్టమైన తేడా ఉంది. మొదటి దాని విషయంలో వ్యవస్థలో పెరిగిన నగదు లభ్యతను ‘రివర్స్‌’ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం ‘హెలికాప్టర్‌ మనీ’ విషయంలో లేదు. అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌గా ఉన్న బెన్‌ బెర్నెంకే.. 2002లో జపాన్‌ వెళ్లి, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు... ‘హెలికాప్టర్‌ మనీ’ విధానాన్ని అమలు చేయండని సూచించారు. కానీ వాళ్లు పాటించలేదు. ఆ తర్వాత 2008 ఆర్థిక సంక్షోభ సందర్భంలో కూడా అమెరికా ఈ పద్ధతికి మొగ్గుచూపలేదు. ఇంతవరకూ ఎక్కడ జరగని ఈ విధానం మనదేశంలోనూ వచ్చే అవకాశం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ‘హెలికాప్టర్‌ మనీ’ వైపు వెళ్తే, ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది.

వలసకూలీల సమస్యలను ఎలా పరిష్కరించాల్సి ఉంది.?

ఈ రంగం ఎప్పుడూ ఉంటుంది. ఈ దేశానికి చాలా అవసరం కూడా. అసంఘటిత రంగాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించడం సాధ్యం కాదు. వలసలుంటాయి. వలస కూలీలుంటారు. అయితే వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. సరైన వసతి, ఆరోగ్య సదుపాయాలుండేలా చూడాలి.

2008లో వచ్చిన ఆర్థికమాంద్యంతో ప్రస్తుత కరోనాతో తలెత్తిన సంక్షోభాన్ని పోల్చవచ్చా. మీ దృష్టిలో ఏది పెద్ద సవాలు?

కరోనాతో ఆర్థిక మాంద్యం చాలా తీవ్రంగా ఉండబోతుంది. దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆర్థిక సేవల రంగంలో మొదలైంది. ధనిక దేశాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రకరకాలైన ‘డిరవేటివ్‌ ప్రొడక్ట్‌’లను ఆవిష్కరించి ఆ రంగం కుప్పకూలిపోవడానికి కారణమయ్యాయి. దీనివల్ల ప్రజలు తమ సంపదను, పొదుపు మొత్తాలను కోల్పోవడంతో డిమాండ్‌ క్షీణించింది. ఆ ప్రభావం వాస్తవ ఆర్థిక వ్యవస్థ(రియల్‌ ఎకానమీ)కు విస్తరించింది. ప్రస్తుత కరోనా ఆర్థిక సంక్షోభం దీనికి పూర్తిగా భిన్నం. ఇది ఒక మహమ్మారి వల్ల వచ్చింది. దీనివల్ల ముందుగా వాస్తవ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగి, తదుపరి అది ఆర్థిక సేవల రంగానికి విస్తరిస్తోంది. సఫ్లై చైన్‌ వ్యవస్థలు, డిమాండ్‌ తగ్గిపోయాయి. ఈ రెండు సమస్యలకు మూలం వేరు కాబట్టి పరిష్కార మార్గాలు కూడా భిన్నంగా ఉండాలి. అప్పట్లో ముందుగా ఆర్థిక సేవల రంగానికి అండగా నిలవాల్సి వచ్చింది. అందుకు ఈ రంగంలోని సంస్థలను నిలబెట్టడం తక్షణావసరమైంది. ఆర్థిక రంగం కోలుకునేలా చేస్తేనే వాస్తవ ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితి అప్పటిది. కానీ ఇప్పుడు మాత్రం మనం కరోనా మహమ్మారిని కట్టడి చేయాలి. దాన్ని సాధిస్తేనే వాస్తవ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. అంటే ముందు వాస్తవ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే, తర్వాత ఆర్థిక సేవల రంగం కోలుకుంటుంది. సమస్య మొదలైన ప్రాంతం కూడా విభిన్నమే. అప్పట్లో ఆర్థిక సంక్షోభం అమెరికాలో ‘సబ్‌ప్రైమ్‌’ మార్ట్‌గేజ్‌ రంగంలో మొదలై ప్రపంచమంతా విస్తరించింది. కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌లో వెలుగుచూసి ప్రపంచమంతా సోకింది.

ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు

ABOUT THE AUTHOR

...view details