మేం ఎవరి ప్రలోభాలకూ లోను కాలేదు.. మా భూములు మా దగ్గరే ఉన్నాయి, అసైన్డు భూములపై అపోహలు సృష్టించొద్దని.. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు విజ్ఞప్తి చేశారు. ‘జరీబు భూములతో సమానంగా అసైన్డు రైతులకూ ఎకరానికి 1,400 గజాల చొప్పున ఇప్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి చెప్పడంతో ఇప్పటి వరకు ఆగాం. సీఎం హామీ ఇచ్చి రెండేళ్లయినా ప్లాట్లు కేటాయించలేదు. ప్యాకేజీ అందలేదు. కౌలు చెక్కులూ ఇవ్వడం లేదు’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘యూనిట్ 14, 15 పరిధిలోని అసైన్డు భూముల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించాలి. భూమిలేని రైతులకు రూ.5 వేల చొప్పున పింఛను ఇప్పించాలి’ అని కోరారు. రాయపూడి రెవెన్యూ పరిధిలోని పలువురు రైతులు విజయవాడలోని ఏఎంఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి కమిషనర్ లక్ష్మీనరసింహంకు వినతిపత్రం అందజేశారు. వీటితోపాటు గతంలో ఇచ్చిన అర్జీలనూ జత చేశారు.
'గత ప్రభుత్వం ప్లాట్లు ఇస్తామన్నా వద్దన్నాం'
‘రాయపూడి గ్రామ ఎస్సీలకు ప్రభుత్వం సీలింగ్, డీఫారం పట్టాల ద్వారా అసైన్డు భూములను మంజూరు చేసింది. ఎవరి ప్రలోభాలకు లోనవకుండా ప్రజారాజధాని అమరావతికి వాటిని భూసమీకరణ కింద ఇచ్చాం. జీవో 41 ప్రకారం ఇచ్చే ప్యాకేజీకి అంగీకరించాం’ అని అంబేడ్కర్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ అధ్యక్షుడు కంభంపాటి బాబూరావు, రైతులు దేవునిదయ, సలగల దానియేలు, నల్లయ్య, చిలకా బసవయ్య తదితరులు చెప్పారు. ‘అధికారంలోకి వస్తే జరీబు భూముల రైతులతో సమానంగా అసైన్డు భూముల రైతులకు ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. భూమిలేని రైతు కూలీలకు పింఛనును రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచుతామన్నారు. దీంతో మంచి ప్యాకేజీ వస్తుందని.. అప్పటి ప్రభుత్వం ఇస్తామన్న ప్లాట్లను కూడా వద్దన్నాం. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సీఎం హామీలు నెరవేర్చలేదు. కూలి పనులూ లేక, ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డు భూములపై అపోహలు కల్పిస్తూ, ఎస్సీలపై ఉన్న నమ్మకాన్ని చెరిపేలా ఈ ప్రభుత్వం కుట్ర పన్నడం బాధాకరమని రైతులు అన్నారు. ‘రాజధాని ప్రకటించాక ఒక్కొక్కరం 90 సెంట్ల చొప్పున 143 మంది ఇవ్వాలని నిర్ణయించాం. అయితే మా పట్టాలు పోయాయి. వాటి కోసం కలెక్టర్, తహసీల్దార్ల చుట్టూ ఆరేళ్లుగా తిరుగుతున్నాం. అప్పటి ప్రభుత్వం 600, 850 గజాలే ఇస్తామనడంతో తీసుకోలేదు. 1400 గజాల కోసమే ఆగాం. ఇప్పటి వరకు పైసా ప్రయోజనం దక్కలేదు’ అని వాపోయారు.