రాయలసీమ ప్రాంతంలోని మూడు ప్రాజెక్టులకు ఫీడర్‌గా మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనిచేస్తుందని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ బెంచ్‌లో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ఈమేరకు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై వివరాలను సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు 2006 పర్యావరణ ప్రభావ నివేదికలోని ఏ నిబంధనలను ఉల్లంఘించటం లేదని అఫిడవిట్లో పర్యావరణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కొత్తది కాదని అలాగే అదనపు నీటి వినియోగం లేదని పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టు లేదా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పరిధిలోకి రాయలసీమ ఎత్తిపోతల రావటం లేదని అఫిడవిట్లో స్పష్టం చేసింది. పాతప్రాజెక్టు విస్తరణ లేదా ఆధునీకరణ చేపడితే పర్యావరణ అనుమతులు అవసరం అవుతాయని ప్రస్తుతం ఆ నిబంధనల పరిధిలోకి రానందున కొత్తప్రాజెక్టుగా పరిగణించటం లేదని తేల్చి చెప్పింది.
రాయలసీమ ఎత్తిపోతల కారణంగా అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించలేమని ఎన్జీటీకి స్పష్టం చేసింది. తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడికాలువల ప్రాజెక్టులకు ఫీడర్గామాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పనిచేస్తుందని ఎన్జీటీకీ సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. వీటికి గతంలోనే పర్యావరణ అనుమతులు తీసుకున్నారని పేర్కొంది.