రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జరగడం లేదని కేంద్ర అటవీ పర్యావరణశాఖ శాస్త్రవేత్త పసుపులేటి సురేష్‌బాబు నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న లక్షణాలు ఏమీ అక్కడ లేవని, పనుల్లో పురోగతి లేదని పేర్కొన్నారు. నిర్మాణ పనుల కోసం గతంలో సమీకరించుకున్న మెటీరియల్ అంతా అక్కడే ఉన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచిలో కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన గనోళ్ల శ్రీనివాస్ కేంద్రప్రభుత్వం తదితరులను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా సీమ ఎత్తిపోతల నిర్మాణం చేపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ కేసులో జత చేరింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయో లేదో గమనించి నివేదిక ఇవ్వాలని గతంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. బోర్డు ఏర్పాటుచేసిన కమిటీ సీమ ఎత్తిపోతలను సందర్శించి డీపీఆర్ తయారీకి అవసరమైన పనుల కన్నా మించి అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయని నివేదిక ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌జీటీ ఆగస్టు 16న విచారణ జరిపినప్పుడు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి కూడా నివేదిక కోరింది. దీంతో విజయవాడలో ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇక్కడి శాస్త్రవేత్త పసుపులేటి సురేష్‌బాబు సెప్టెంబరు 6న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించారు.
'సీమ ఎత్తిపోతల పనులు జరగడం లేదు' - రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు
సీమ ఎత్తిపోతల పనులు జరగడం లేదని కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాస్త్రవేత్త పసుపులేటి సురేశ్ బాబు..కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చారు. నిర్మాణ పనుల కోసం గతంలో సమీకరించుకున్న మెటీరియల్ అంతా అక్కడే ఉన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.
rayalaseema lift irrigation scheme works details