రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదనీ.. విభజన చట్టం ప్రకారం దీనిని చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, కర్నూలు చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి కృష్ణా బోర్డుకు తెలియజేశారు. ఈ ఎత్తిపోతలకు కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుందని కేంద్ర జలసంఘం తేల్చి చెప్పిన సందర్భంగా.. వీరిద్దరూ సోమవారం హైరాబాద్‌లో బోర్డు ఛైర్మన్ పరమేశంతోనూ కలవాలనుకున్నారు. ఛైర్మన్ అందుబాటులో లేకపోవటంతో సభ్య కార్యదర్శులు రాయపురి, మీనాలను కలిసి అన్ని విషయాలను వివరించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తది కానందున సమగ్ర డీపీఆర్ ఉండదనీ.. ప్రాజెక్టు వివరాలు మాత్రమే సమర్పించామన్నారు. బోర్డు సభ్య కార్యదర్శులు వీటిపై సాంకేతికంగా అనేక సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తారు. ఒకేసారి ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీరు తీసుకుంటారా అని ప్రశ్నించారు. దీనిపై..'అలా తీసుకునే అవకాశం లేదు. కేవలం శ్రీశైలం జలాశయం 800 నుంచి 854 అడుగుల నీటిమట్టం వద్ద మాత్రమే నీటిని ఎత్తిపోతలతో తీసుకుంటా. ప్రతీ చుక్కకు పక్కా లెక్క ఉంటుంది. కేవలం మా వాటా నీటిని తీసుకునేందుకు మాత్రమే ఈ కొత్త ఏర్పాటు చేసుకుంటున్నా...' అని ఈఎన్సీ, చీఫ్ ఇంజినీరు వివరించారు.