రాష్ట్రంలో అటకెక్కిన ఉచిత రేషన్ పంపిణీ... ఎప్పుడిస్తారనేదానిపైనా స్పష్టత కరవు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. రెండు నెలలుగా పంపిణీ చేయడం లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులకూ కేంద్రమే ఇస్తే.. తాము సరఫా చేసేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. ఇదెప్పటికి తేలుతుందో... పేదలకు బియ్యం ఎప్పటి నుంచి ఇస్తారో.. స్పష్టత కొరవడింది.
కొవిడ్ నేపథ్యంలో.. రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. 2020 సంవత్సరం నుంచీ దశలవారీగా పొడిగించుకుంటూ వస్తున్న ఈ పథకం కింద.... ఆరో దశలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రేషన్ అందించాల్సి ఉంది. అయితే... ఏప్రిల్, మే నెలల్లో కార్డుదారులకు కిలో కూడా పంపిణీ చేయలేదు. ఎప్పుడిస్తారో తెలియక.... కార్డుదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. తమకూ విషయం తెలియదనే సమాధానం... సంబంధింత డీలర్ల నుంచి వస్తోంది.
ప్రజాపంపిణీ వ్యవస్థ కింద అందించే పార్టెక్స్ లేదా నాణ్యమైన బియ్యాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం.. వాహనాల ద్వారా ప్రతి నెల 15వ తేదీ వరకు పంపిణీ చేస్తోంది. 16వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. అంటే నెలలో రెండుసార్లు రేషన్ ఇస్తారు. కాగా.... కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో.... ఏప్రిల్ నెలలో వాహనాల ద్వారా బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉచిత బియ్యాన్ని ఇవ్వలేదు. మే నెల 17వ తేదీ వరకు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కొనసాగింది. తర్వాత అయినా...ఉచిత బియ్యం ఇస్తారేమోనని... దుకాణాలకు వెళ్లిన కార్డుదారులకు... ఇంకా బియ్యం రాలేదనే సమాధానమే వచ్చింది.
రాష్ట్రంలో కోటీ 45 లక్షల కార్డుదారుల పరిధిలోని 4.24 కోట్ల మందికి... ప్రతి నెలా 2.34 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన, ఆహార భద్రత చట్టం కింద ఉండే 86 లక్షల కార్డుల పరిధిలోని 2.68 కోట్ల మందికి కేంద్రం ప్రతి నెలా.. 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తుంది. మిగిలిన బియ్యాన్ని రాష్ట్రం పంపిణీ చేస్తుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద అందించే ఈ బియ్యాన్ని రాయితీపై కిలో రూపాయి చొప్పున ఇస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇచ్చే ఉచిత బియ్యం అదనం. రెండు రేషన్‌ల ద్వారా తమపై అదనపు భారం పడుతోందని..రాష్ట్రం చెబుతోంది. తాము నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని... కేంద్రం ఉచిత బియ్యం పథకం కింద వీటిని ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో కోటీ 45 లక్షల రేషన్ కార్డులు ఉంటే... కేంద్రం 86 లక్షల కార్డులకే బియ్యం ఇస్తోందని... పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మిగిలిన కార్డులకు బియ్యం అచ్చేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తోందని చెప్పారు. తప్పు కేంద్రానిదే అన్న మంత్రి...రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు బియ్యాన్ని వారే ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. నీతి ఆయోగ్ కూడా ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసిందన్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌నూ కలిసి.... మొత్తం కార్డులకు బియ్యం కేటాయించాలని కోరినట్లు మంత్రి కారుమూరి చెప్పారు. అప్పుడే అందరికీ ఇవ్వగలుగుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'ఇషా గుప్తా' స్కిన్ షో చూస్తే.. నిషా ఎక్కాల్సిందే!