అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి మూల విరాట్‌కు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారు ఉభయ దేవేరులతో కలసి నాలుగు వాహనాలలో మాడ వీధుల్లో విహరించారు. మొదట సూర్యప్రభ వాహన సేవతో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గో, హనుమ, గరుడ వాహనాలపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
కమణీయం కల్యాణం..
రథసప్తమి సందర్భంగా పెన్నహోబిలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఆలయ ఈఓ రమేశ్ బాబు ధర్మకర్తల మండలి ఛైర్మన్ అశోక్ కుమార్, డీఎస్పీ షర్ఫుద్దీన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారితో ఉభయ దేవేరులకు మంగళ ధారణ కార్యక్రమం జరిపారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తుల గోవిందనామస్మరణల మధ్య శ్రీవారి కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి వారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు బాలాజీ స్వామి, గుండు స్వామి, వైకాపా నేతలు పాల్గొన్నారు.
చిత్తూరులో...
రథసప్తమి వాహన సేవలను దర్శించుకునేందుకు తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో తిరుమాడవీధులు కిక్కిరిసి పోయాయి. కరోనా ప్రభావంతో ఏడాదిగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు ఏకాంతంగా జరిగాయి. గత ఏడాది మార్చి నుంచి సందడి కోల్పోయిన తిరుమల కొండ... రథసప్తమి వేడుకకు వచ్చిన యాత్రికులతో సందడి వాతావరణం నెలకొంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహన సేవలపై దర్శనమిచ్చారు.
శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆలయంలోని శ్రీ సూర్య భగవానుడుకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగారు.
గుంటూరులో..
తెనాలిలోని వైకుంఠపురం క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామిని సేవించారు. ఈ సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి ఆయన కూడా కాసేపు రథం లాగారు. స్వామివారి రథోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. వైకుంఠపురం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆలయానికి కోటిన్నర విలువచేసే ఇంటిని ఇచ్చిన గట్టినేని కృష్ణకుమారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చిలకలూరిపేటలో రథసప్తమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. స్థానిక గీతా మందిరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఛాయా ఉషా దేవి సమేత సూర్యనారాయణస్వామికి ప్రత్యేక అలంకరణ చేసి.. పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిర్వాహక కమిటీలు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశాయి.
కడపలో...