కరోనా అనుమానితుల పరీక్షల కోసం ప్రాథమికంగా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు జిల్లాకు 20 వేల చొప్పున కిట్లు సరఫరా చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి... సదరు రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు సూచించింది. కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే అలాంటి వారికి మరోమారు రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని స్పష్టం చేసింది.
హై రిస్కు కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని తెలిపింది. 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్చార్జ్ అవుతున్నవారిని కూడా.... ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులను డిశ్చార్జ్ చేసేందుకు...ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.