తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో గతేడాది ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒడిశాలోని బలంగీర్ జిల్లాకు చెందిన బాధితురాలు జీవనోపాధి కోసం భర్త, రెండేళ్ల కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. నగర శివార్లలోని మహేశ్వరం మండలం నాగుల ధోని తండాలోని ఇటుక బట్టిలో పనిచేసేది. వీరితోపాటు అదే జిల్లాకు చెందిన నలుగురు యువకులు రాహుల్ మాజీ, మనోజ్ సామ్రాట్, దుర్గా సామ్రాట్, దయా మాజీ అక్కడే పని చేసేవారు.
గతేడాది ఆగుస్టు 16న రాత్రి 8 గంటల సమయంలో బాధితురాలిని నలుగురు యువకులు వెంబడించి.. నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పూర్తవగా నిందితులకు 20ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2వేల జరిమానా విధించింది. నిందితులకు త్వరగా శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించిన మహేశ్వరం పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.