ప్రకృతి విపత్తులు, పెట్టుబడుల కొరత, దళారుల బెడద... వ్యవసాయంలో అన్నదాతకు నిరంతరం సవాళ్లే. వీటి నుంచి గట్టెక్కించాలంటే వారూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఒకటే మార్గం. దీనికోసమే నా కృషి అంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన చింతల రమ్యప్రియ.
రైతులకు అండగా నిలిచేందుకు ‘భూమాత అగ్రి’ అంకుర సంస్థ స్థాపించారు. తనకున్న విజ్ఞానం, సృజనాత్మకత జోడించి ‘రామసేతు’ అనే మొబైల్ యాప్ రూపొందించారు. దీనిద్వారా నారు పోసిన దగ్గర నుంచి బియ్యం మిల్లింగ్ చేయించే వరకు ప్రతి సదుపాయాన్ని రైతుకు చేరువలో ఉంచుతుంది. వరి నాటే యంత్రాలు, కలుపు తీసే మిషన్లు, కోత యంత్రాలు రొటోవేటర్లు, ట్రాక్టర్లతో పాటు సంచార రైస్‌మిల్లు కూడా తక్కువ అద్దెకు చేరవేస్తున్నారు.