తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ కథ ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న చిత్రం కొండా. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా వంచనగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన కొండా దంపతులతో కలిసి గ్రామదేవతలకు పూజలు చేశారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జీవీ.. అమ్మవారికి విస్కీ శాక పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
"నాకు వొడ్కా మాత్రమే తాగటం అలవాటున్నప్పటికీ.. గండిమైసమ్మకు మాత్రం విస్కీ తాగించాను. చీర్స్.." అంటూ తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.
ఆర్జీవీ పూజలు చేయటమేంటీ..?
సాధారణంగా వర్మ దేవుళ్లను అస్సలు నమ్మడు. కానీ.. కొండా సినిమా షూటింగ్ ప్రారంభం కోసం మాత్రం కొండా దంపతులు నమ్మే గ్రామదేవతలకు పూజలు చేయటం గమనార్హం. అందులోనూ.. గండిమైసమ్మకు విస్కీ తాగించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. "దేవుళ్లను అసలే నమ్మని ఆర్జీవీ గ్రామదేవతలకు పూజలు చేయటమేంటీ..?" అని కొందరు ముక్కున వేలేసుకుంటే.. "దేవతకు మందు తాగించటమేంటీ..?" అని మరికొందరు మండిపడుతున్నారు.