ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana: యునెస్కో వెబ్​సైట్​లో రామప్ప చిత్రాలు - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయం యునెస్కో వారసత్వ హోదా కోసం పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు మరో అడుగు చేరువలో ఉంది. కోవెలకు సంబంధించిన చిత్రాలను యునెస్కో అధికారిక వెబ్​సైట్​లో పొందుపరిచింది. గుడికి సంబంధించిన పూర్తి వివరాలు, నామినేట్‌ కావడానికి గల కారణాలనూ వివరించింది.

Ramappa Temple pictures in unesco website
యునెస్కో వెబ్​సైట్​లో రామప్ప చిత్రాలు

By

Published : Jul 6, 2021, 11:43 AM IST

యునెస్కో వెబ్​సైట్​లో రామప్ప చిత్రాలు

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు మరో అడుగు చేరువలోకి వచ్చేసింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు సమావేశం కానీ యునెస్కో ప్రతినిధులు ఈ నెల 18న చైనాలో సమావేశమవుతున్నారు. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించినట్లు స్పష్టమవుతోంది.

యునెస్కోలో రామప్ప

రామప్పతోపాటు హరప్పాలోని డోలవీర ఆలయం నామినేట్‌ అయినట్లు కేంద్ర పురావస్తు శాఖ ఇటీవల ప్రకటించింది. 2020, 2021 సంవత్సరాలకుగాను ప్రపంచవ్యాప్తంగా 41 వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలగలిసినవి ఉండగా.. 2020 సంవత్సరానికి 24 నామినేషన్లు యునెస్కో పరిశీలనలో ఉన్నాయి. వాటిలో మనదేశం నుంచి రామప్ప ఆలయం మాత్రమే ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన ఈ గుడికి సంబంధించిన 11 ఫొటోలను యునెస్కో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

త్వరలో ఓటింగ్

కోవెలకు సంబందించిన పూర్తి వివరాలు, నామినేట్‌ కావడానికి గల కారణాలనూ వివరించింది. 2021 నామినేషన్లలో మన దేశం నుంచి హరప్పా నగరంలోని డోలవీర ఆలయం ఉంది. గతేడాది కరోనా కారణంగా వారసత్వ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఈసారి 2020, 2021కి సంబంధించి... గుర్తింపు ఇచ్చేందుకు ఈనెల 16 నుంచి 23 వరకు ఓటింగ్‌ నిర్వహించనుంది.

శిల్ప సంపదకు చిరునామా

కాకతీయులు తీర్చిదిద్దిన అద్భుత శిల్పసంపదకు చిరునామా రామప్ప దేవాలయం. పాలంపేటలో శాండ్ బాక్స్ సాంకేతికత, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మించడం ఈ కోవెల ప్రత్యేకత. మనోహరంగా కనిపిస్తూ... మదిని దోచే శిల్పాలు, సరిగమలు పలికే ప్రతిమలతో పలు విశిష్టతలు కలిగిన ఈ గుడి రెండేళ్ల క్రితమే ప్రపంచ వారసత్వ పోటీకి నామినేట్ అయింది.

కరోనా కారణంగా ఆలస్యం

యునెస్కో హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు 2020 జులైలో చైనాలో సమావేశమై వివిధ దేశాల కట్టడాలను... వాటి విశిష్టతలను పరిశీలించాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సమావేశం ఇన్నాళ్లూ వాయిదా పడింది. ఈనెల 18నుంచి 28 వరకు యునెస్కో ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు వర్చువల్​గా సమావేశమవనున్నారు.

వివిధ భాషల్లో వీడియోలు

ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకతలను పలుమార్లు కమిటీ ప్రతినిధులకు పంపించారు. తాజాగా ఆలయ విశిష్టతను తెలియజేస్తూ ఆంగ్లం, స్పానిష్, రష్యన్, చైనీస్, ఫ్రెంచ్, అరబిక్ భాషల్లో చిత్రీకరించిన వీడియోలనూ పంపించారు. పూర్తి వివరాలతో కూడిన మూడు పుస్తకాలను పంపించారు.

గుర్తింపు ఖాయం

రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు కచ్చితంగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక 2021వ సంవత్సరానికిగాను అర్హత సాధించిన హరప్పా డోలవీర ఆలయ చిత్రాలనూ యునెస్కో వెబ్​సైట్​లో ఉంచారు. రెండింటికీ ఒకేసారి వారసత్వ గుర్తింపు ఇచ్చే అంశం పరిశీలించేందుకు కమిటీ ప్రతినిధులు వర్చువల్​గా సమావేశమవనున్నారు.

  • ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం

ABOUT THE AUTHOR

...view details