Ramanuja Sahasrabdi Utsav: హైదరాబాద్ ముచ్చింతల్లో.. జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఐదో రోజు సమతామూర్తి కేంద్రం భక్తులతో కిటకిటలాడింది. ఓ వైపు యాగశాలలో నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ మహాయాగం కొనసాగుతోంది. మరోవైపు సమతామూర్తి విగ్రహాన్ని వీక్షించేందుకు భారీసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీరామనగరం ఎక్కడ చూసినా సందడిగా మారింది.
మొదటి నాలుగు రోజులు సాధారణ భక్తులను అనుమతించలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణతో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. అయితే సందర్శకులను కేవలం విగ్రహం వరకు మాత్రమే అనుమతించారు. 108 దివ్యదేశాల ఆలయాల ప్రతిష్టాపన పూర్తికాకపోవడం వల్ల అటువైపు ఎవరిని వెళ్లనివ్వలేదు. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన భక్తులు.. దివ్యదేశాల ప్రాణప్రతిష్ట తర్వాత మరోసారి వచ్చి పూర్తిగా వీక్షిస్తామని చెబుతున్నారు.
ఏకధాటిగా మహాక్రతువు..
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా యాగశాలలో తొలుత పరమేష్ఠి యాగాన్ని నిర్వహించారు. తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ యాగాన్ని నిర్వహించినట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ఈ యాగాన్ని ఐదువేల మంది రుత్వికులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పితృదేవతల తృప్తి కోసం, పితృ దోష నివారణ కోసం వైభవేష్టి హోమాలను నిర్వహించారు. నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ 114 యాగశాలలో 1035 హోమ గుండాల్లో ఏకధాటిగా లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
హాజరైన జొన్నవిత్తుల..