రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి.. రాజ్యసభలో ప్రస్తావించారు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసంతో పాటు.. ఇతర ఆలయాలపై జరిగిన దాడులను సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై సత్వరమే స్పందించడం లేదని.. ఫలితంగా ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ దాడులతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని చెప్పారు. కేంద్ర హోం శాఖ సత్వరమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'చేనేత కార్మికుల సమస్యలు తీర్చండి.. ఆలయాలపై దాడులు ఆపించండి' - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు
రాష్ట్ర సమస్యలపై.. రాజ్యసభలో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రసంగించారు. ఆలయాలపై దాడులు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జీవీఎల్ కేంద్రాన్ని కోరారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
చేనేత కార్మికుల సమస్యలపై...
చేనేత రంగంలో.. ఏటా రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో చెప్పారు. చేనేత మగ్గాలపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీ కారణంగా.. కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కార్మికులపై భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులు ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలను, వాటి పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రం ఈ విషయంలో స్పందించి కార్మికుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.