ఆన్‌లైన్‌లో ఆడండి..! డబ్బులు సంపాదించండి. ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తే లక్షల రూపాయల మీ ఖాతాలోకి వచ్చి చేరతాయి. యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటేనే వందల రూపాయల బహుమతి. ఇలాంటి ప్రకటనలు చూసి ఆకర్షితులవుతే అంతే సంగతి! లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన కొంతమంది ఆన్‌లైన్ ఆటలతో జేబులు గుల్ల చేసుకున్నారు. ఆటలన్నీ ఆన్‌లైన్ అయిన ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అంతా కాలక్షేపం కోసం ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడిపోయారు. ఇదే ఆసరాగా చేసుకుని వల వేసి లక్షల రూపాయలు కాజేసే ముఠాలు పెరిగిపోతున్నాయి.
ఆటకు బానిస.. జీవితం తలకిందులు
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఆటలకు బానిసలుగా మారి జీవితాలు తలకిందులు చేసుకున్న వారెందరో. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో నూజివీడు పట్టణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ ఒకరు కోటి 56 లక్షల రూపాయలు పక్కదారి పట్టించినట్లు బ్యాంకు మేనేజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ఆటలో ఈ డబ్బు వెచ్చించినట్లు తేలింది. ఫలితంగా ఉద్యోగం పోవటంతో పాటు జీవితమే తారుమారైంది. అమలాపురంలో 9వ తరగతి విద్యార్థి.. తల్లి స్మార్ట్‌ఫోన్‌లో ఆడిన ఆన్‌లైన్ గేమ్‌తో అయిదున్నర లక్షల వరకూ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆన్‌లైన్ తరగతులకు హాజరవ్వగా స్క్రీన్‌పై ప్రకటన క్లిక్ చేయటం వల్ల ఆ విద్యార్థి ఆటకు బానిసయ్యాడు. ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్‌లు వస్తున్నా పట్టించుకోలేదు. మొత్తంగా ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలైంది.
విశాఖ జిల్లాలో ఆన్‌లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు రూ.6 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా రాష్ట్రంలో అధికారికంగా నమోదైన కేసులు ఇవైతే... అనధికారిక సంఘటనలు కోకొల్లలు. 15 ఏళ్ల పిల్లల నుంచి నడివయసు వారి వరకూ అనేక మంది ఈ ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బలవుతున్నారు. గోదావరిజిల్లాలో ఇద్దరు స్నేహితులు కలసి పైపుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమ ప్రారంభించారు. మార్కెటింగ్ పనులు చూసుకొనే వ్యక్తి ఆన్‌లైన్ రమ్మీకి అలవాటుపడి సంస్థ డబ్బులు ఖర్చు చేయటం వల్ల అది వివాదానికి దారి తీసింది. ఈ విధంగా వ్యాపారాలు, స్నేహాలు దెబ్బతిన్న సంఘటనలూ ఉన్నాయి.
విజయవాడకు చెందిన ఓ విద్యార్థి ఈ మధ్యే ఉద్యోగంలో చేరాడు. సంస్థకు సంబంధించిన నగదు లావాదేవీలు చూడటం.. ఆ డబ్బుని బ్యాంకులో జమ చేయటం అతడి విధి. కొన్నాళ్లు బాగానే సాగినా.. క్రమంగా ఆన్‌లైన్ ఆటలకు అలవాటు పడ్డాడు. సరదాగా ఆడిన ఆటతో మొదట వంద, వెయ్యి రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అదేపనిగా ఆడితే ఇంకాస్త సంపాదించ వచ్చన్న ఆలోచనతో కొనసాగించాడు. తరవాత డబ్బు పోగొట్టుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో సంస్థ నగదు ఆన్‌లైన్ ఆటకే వినియోగించాడు. రూ.20 లక్షలు వరకూ పోగొట్టుకున్నాడు. యాజమాన్యానికి విషయం తెలిసి ఉద్యోగం నుంచి తొలగించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకున్నా పూర్తిస్థాయిలో తిరిగి చెల్లించలేక పోయాడు.