Rains in AP: రాష్ట్రవ్యాపంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలోని జిల్లాలు జలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లా పాపాగ్ని నది ఉద్ధృతికి కమలాపురం వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ ఉండే వంతెన కూలిపోగా.. రాకపోకలకు ఇబ్బంది లేకుండా 50 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వెలుగుల్లి ప్రాజెక్టుకు భారీ నీరు చేరడంతో.. 9 గేట్లు ఎత్తారు. దీంతో వరద ఉద్ధృతికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. అధికారులు ముందు జాగ్రత్తగా రాత్రి నుంచే వాహనాల రాకపోకలు ఆపేశారు. కడప వైపు వెళ్లే వాహనాలను కాజీపేట మీదుగా దారి మళ్లించారు. త్వరితగతిన పనులను చేపట్టి రోడ్డును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
వైఎస్సార్ జిల్లా కమలాపురం వద్ద వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన.. పాపాగ్నినది అప్రోచ్ రోడ్‌ను అధికార, ప్రతిపక్షనేతలు పరిశీలించారు. ఆరు నెలల క్రితం వేసిన అప్రోచ్ రోడ్డు తక్కువ సమయంలోనే దెబ్బతినడంతో స్థానిక తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ. 6 కోట్లతో నిర్మించిన రోడ్డు నాణ్యతపై ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పెన్నా నదిపై పేరూరు సమీపంలో నిర్మించిన అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో కంబదూరు, కళ్యాణదుర్గం, బెలుగుప్ప మండలాల పరిధిలో ప్రవహిస్తున్న పెన్నా నది ఉద్ధృతి చూడటానికి పరీవాహక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంబదూరు మండలం నూతిమడుగు సమీపంలో పెన్నా నదిపై నిర్మించిన కాజ్ వే పై నీరు ప్రవహిస్తుండగా.. ధర్మవరం- కళ్యాణదుర్గం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో సువర్ణముఖి నదీ ప్రవాహ ఉద్ధృతికి వంతెన కొట్టుకుపోయింది. అగలి నుంచి మడకశిరకు రాకపోకలు స్తంభించాయి. వాహనాలను వేరే వైపునకు వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు.గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు.... రహదారులన్నీ దారుణంగా మారాయి. అగలి మండల చెరువుకు కర్ణాటకలోని సువర్ణముఖి నది జలాలు చేరుతున్నాయి. నదీ జలాలు వచ్చే ఉప కాలువ గట్లు పలుచోట్ల తెగడంతో స్వచ్ఛందంగా మండల ప్రజలు జేసీబీ ద్వారా మట్టిని పూడ్చి చెరువుకు నదీ జలాలు వెళ్లేలా పనులు చేపట్టారు.