నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతోపాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సూచించారు. కృష్ణా, ఏలూరు జిల్లాల వరకు వీటి ప్రభావం కన్పిస్తోంది. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేశారు.
కరుగుతున్న నైరుతి మేఘం.. పలుచోట్ల భారీ వర్షాలు!
నైరుతి మేఘం కరుగుతోంది.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షిస్తోంది.. వాతావరణ శాఖ ప్రకటన కన్నా మూడ్రోజులు ముందే దేశంలోకి అడుగుపెట్టిన నైరుతి రుతు పవనాలు.. ముందుకు సాగడంలో మాత్రం ఆటంకాలు ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు కాస్త వేగం పుంజుకున్న రుతు పవనాలు.. రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ కారణంగా.. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
rains
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో 63.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జి మండలం విజయరాంపురంలో 63, పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 42. మి.మీ వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి.