వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా - ఉత్తర కోస్తాంధ్రా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు పడమరల వరకూ మరో ద్రోణి ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా నేడు, రేపు ఉరుములతో కూడిన మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని స్పష్టం చేశారు. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒకటీ రెండు చోట్ల.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, కర్నూలు,కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వర్షాలు..
శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపాడు జాతీయ రహదారి వరదనీటితో నిండిపోయింది. పెద్దపాడు కూడలి నుంచి మారుతీ కార్ల షోరూం వరకు జలమయమైంది. ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, రేగిడి, మండలాల్లో మోస్తరు వర్షం పడింది. నరసన్నపేట, కోటబొమ్మాళి, వీరఘట్టం, బూర్జ, సీతంపేట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.