ASANI CYCLONE: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాన్.. బలహీనపడి తుపాన్‌గా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షంతో చాలా చోట్ల వరి పంట నీట మునిగింది.
పశ్చిమగోదావరి జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో.. పశ్చిమగోదావరి జిల్లాలో తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలోని పీఎం లంక, సీఎం లంక, కెపీపాలెం, పేరుపాలెం ప్రాంతంలో అలల ఉద్ధృతి భారీగా పెరిగింది. కెరటాల ధాటికి పీఎంలంకలో కొబ్బరి, సర్వి తోటలు కోతకు గురవుతున్నాయి. చిరుజల్లులు, సముద్రపు పోటుతో ఉప్పుముడులు నీటమునిగాయి. వర్షంతో చాలా చోట్ల వరి పంట నీట మునిగింది.
కాకినాడ జిల్లా:జిల్లాపైఅసని ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ- ఉప్పాడ తీరంలో పరిస్థితిని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. బీచ్ రోడ్ లో స్థానిక మత్స్యకార కుటుంబాలతో చర్చించిన ఆయన...అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోనసీమ జిల్లాలో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
కృష్ణా జిల్లా:అవనిగడ్డ నియోజకవర్గంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. హంసలదీవి వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హంసలదీవి బీచ్ గేట్లను మెరైన్ పోలీసులు మూసివేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో కంట్రోల్ రూంలను రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేశారు.
*మచిలీపట్నం సహా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. మచిలీపట్నం వద్ద సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఐదు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి.
*దివిసీమలో అసని తుపాను ప్రభావంతో భారీగా వీస్తున్నాయి. మోపిదేవి, చల్లపల్లి, మండలాల్లో అరటి తోటలు, మునగ తోటలు, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ గాలులకు రోడ్ల పై తాడి చెట్లు, వృక్షాలు విరిగి పడ్డాయి, నిన్న సాయంత్రం నుండి ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈరోజు ఉదయం సరఫరా పునరుద్ధరింారు. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ గాలుల ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా: అసని తుపాను నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లాలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల రాత్రి వర్షం కురిసింది. ఉదయం నుంచి శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, లావేరు, గార, వజ్రపుకొత్తూరు మండలాల్లో తేలికపాటి వాన పడింది. తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తాకిడి జోరుగా ఉన్నాయి. తుపాను దృష్ట్యా కలెక్టరేట్ తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్... జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం ఉంచారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కడప: అసని తుపాను ప్రభావంతో కడపలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్ కూడలి, కోర్టు రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరింది. బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాపట్ల జిల్లా: అసని తుపాన్ కారణంగా బాపట్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ పరిస్థితులపై కలెక్టర్ కె.విజయ కృష్ణన్ ఎప్పటికప్పుడు తీరప్రాంతంలోని అధికారులతో చర్చిస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తుపాన్ కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చీరాల, వేటపాలెం, చినగంజాం తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోలు రూములు ఏర్పాటుచేశారు.. బాపట్లలో 8 సెం.మీ., వేటపాలెంలో 5.54 సెం.మీ. వర్షపాతం నమోదైంది.