ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAIN: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండగా రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. జాలర్లు ఎల్లుండి వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

By

Published : Jul 11, 2021, 10:43 PM IST

Updated : Jul 12, 2021, 4:34 AM IST

పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రధానంగా గన్నవరం-ఆగిరిపల్లి ప్రధాన రహదారి గొల్లనపల్లి రోడ్డు అస్తవ్యస్థంగా తయారైంది. కేసరపల్లి బీసీ కాలనీలో ఇళ్ల మధ్య భారీగా నీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీబీ గూడెం, ముస్తాబాద్‌, గన్నవరం, రాయ్‌ నగర్‌, పెద్ద అవుటపల్లి, తేలప్రోలు, బుద్ధవరంలోని పలు కాలనీల్లో భారీగా నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో...

ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల వరినారుమళ్లు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే నారుమళ్లు మునిగిపోయి కుళ్లి పోతాయని రైతులు వాపోతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలో...

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళసంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు పంట పొలాలు జలమయమయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేసుకున్న రైతులకు ఈ వర్షం అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం చేస్తున్నారు. రాయలసీమలోనూ అక్కడకక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

మరో రెండు రోజులు... భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.... విపత్తు నిర్వహణశాఖ సూచించింది.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

ఇదీ చదవండి:

రాయలసీమ ఎత్తిపోతలపై తెదేపా ఎమ్మెల్యేల అభ్యంతరం... సీఎం జగన్​కు లేఖ!

Last Updated : Jul 12, 2021, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details