ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: చేతికొచ్చిన పంట నీటిపాలు... అకాల వర్షంతో రైతన్న గగ్గోలు - నీటమునిగిన పంట

తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన వరి, మిర్చి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోగా.. కొన్నిచోట్ల పొలాల్లోనే పంట నేలకొరిగింది.

farmers facing problems with rain in Telangana
farmers facing problems with rain in Telangana

By

Published : Apr 23, 2021, 11:29 AM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల ధాటికి చిన్నాభిన్నమైంది. తెలంగాణలో కురిసిన వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో కురిసిన వర్షానికి వరి నేలకొరిగింది. మామిడికాయలు నేలరాలగా.. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో కొద్దిసేపు సరఫరా నిలిచిపోయింది.

తీవ్ర ఆందోళనలో రైతులు

భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ, ఘనపురం మండలాల్లో కురిసిన వర్షానికి మిర్చి పంటకు అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. తడిసిన పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భువనగిరి బస్‌స్టాండ్, జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద భారీగా వర్షం నీరు చేరింది. భారీ వర్షంతో ముందస్తుగా భువనగిరి మండలంలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వికారాబాద్‌ జిల్లా పాతకోటలో పిడుగుపాటుతో 32 గొర్రెలు మృతి చెందాయి.

నగరంలోనూ జల్లులు

హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి మండుటెండలో ఇబ్బంది పడ్డ నగర ప్రజలకు చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. కూకట్‌పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, బాలాజీనగర్, అల్విన్ కాలనీ ప్రాంతాల్లో వర్షం పడింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.


ఇదీ చూడండి:

విశాఖ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

ABOUT THE AUTHOR

...view details