విశాఖ, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలతోపాటు... రాష్ట్రంలో అనేక చోట్ల ఏకధాటిగా కురిసిన వర్షాలకు రహదారులు, పంటపొలాలు నీటమునిగాయి. విశాఖలో పట్టపగలే చీకటి ఆవరించింది. నగరవ్యాప్తంగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో... పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఎంపీవీ కాలనీ సత్యసాయి విద్యావిహార్ సమీపంలో వర్షం నీరుకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. గాజువాక రహదారులు జలమయమయ్యాయి. హఠాత్తుగా వాతావరణం మారటంతో అప్రమత్తం కాలేకపోయిన పోలీసులు, పర్యవేక్షక సిబ్బంది లాక్‌డౌన్ విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విశాఖ జిల్లా చోడవరం, నర్సీపట్నంలో దాదాపు గంటన్నరసేపు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యలమంచిలిలో చెట్ల కొమ్మలు, స్తంభాలు విరిగిపడి నిలిచిన విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. విశాఖ మన్యం డుంబ్రిగుడలో సంపంగి గెడ్డ ఉప్పొంగి, రాకపోకలు నిలిచిపోయాయి. దేవరాపల్లిలో పిడుగులతో కూడిన వర్షం పడింది. అనకాపల్లిలోని దొంగ గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించింది. చినబోయిగూడెం వద్ద ఈదురుగాలులకు తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలతోపాటు... రెండు ఇళ్లపై పడటంతో స్థానికులు భయాందోళనలు చెందారు.