Heavy rains: కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు తూర్పు పడమర ద్రోణి, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ విభాగం వెల్లడించింది.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయల సీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ తెలియచేసింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది. రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
గుంటూరు:ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టి చెరుకూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా పత్తిపాడులోని వంగిపురం వద్ద కాల్వ కట్ట తెగి నీరు పొలాల్లోకి చేరుటంతో, పత్తి, మిర్చి పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.