ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముంచుకొస్తున్న తౌక్టే.. రాయలసీమకు భారీ వర్ష సూచన - rain in ap

లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శనివారం అది ‘తౌక్టే’ తుపానుగా రూపాంతరం చెందుతుందని... ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈనెల 18న గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది.

rain
rain

By

Published : May 15, 2021, 6:29 AM IST

‘తౌక్టే’ కారణంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించి, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. శిబిరాల వద్ద కరోనా నిబంధనలను పాటిస్తున్నా, అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు! కాగా... మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా అధికారులు గస్తీని ముమ్మరం చేశారు. తుపాను ధాటికి ఇప్పటికే కొల్లాం జిల్లాలో అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు జాతీయ విపత్తు స్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అధికారులు తెలిపారు. తుపాను ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు.

తెలంగాణలో....

విదర్భ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా... తెలంగాణలో పలుచోట్ల శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని; గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

రాయలసీమకు భారీ వర్ష సూచన

ఏపీలోని వివిధ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో ఈ రెండు రోజులు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రోజు ముందే... కేరళకు రుతుపవనాలు!

ఈ ఏడాది ఒకరోజు ముందుగా... ఈనెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. రుతుపవనాలు మొట్టమొదట ఈనెల 22న దక్షిణ అండమాన్‌లోని సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతంరం వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేసింది. అయితే- ఒడిశా, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మేఘాలయ, అస్సాంలో అంతకంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి:

జగన్ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details