విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్ చెప్పారు. ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని, అందువల్ల కొత్త రైల్వేజోన్ ప్రారంభానికి కచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేమని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. వైజాగ్ డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చే ప్రాంతాలతోనే కలిపి ఉంచేలా డీపీఆర్‌ను ఏమైనా సవరించారా? అన్న ప్రశ్నకు పీయూష్ గోయల్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. అందువల్ల సవరించిన డీపీఆర్‌ను ఆమోదించే ప్రసక్తే ఉత్పన్నంకాదని చెప్పారు.
తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు
తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ఖరారైనట్లు పీయూష్‌గోయల్ తెలిపారు. ఈ స్టేషన్ల అభివృద్ధి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లను అభివృద్ధికి సాంకేతిక, ఆర్థికపరంగా ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం రైల్వేశాఖ ఎలాంటి నిధులు ఖర్చుచేయదని, పూర్తిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలోనే చేపడుతుందని స్పష్టం చేశారు.