Rahul tour Second day: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఉదయం 10 గంటలకు పలువురు మీడియా అధిపతులతో రాహుల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మీడియాధిపతులను అడిగి తెలుసుకున్న రాహుల్.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రజా గాయకుడు గద్దర్, హరగోపాల్, కంచె ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించడంలేదని ఉద్యమ నేతలను రాహుల్ అడిగినట్లు తెలుస్తోంది.
అనంతరం తాజ్ కృష్ణ హోటల్ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు వెళ్లి రిమాండ్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో ములాఖాత్ కానున్నారు. అధైర్యపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా వారికి కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే చంచల్‌గూడ జైలులో సాధారణ ములాఖాత్‌లను అధికారులు నిలిపేశారు. మధ్యాహ్నం 2 తర్వాత యథావిథిగా ములాఖాత్‌లు కొనసాగించనున్నారు. జైలు వద్ద 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జైలు వద్దకు కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌ఎస్‌యూఐ నేతలు చేరుకుంటున్నారు.