గుత్తేదారులతో రహదారుల పనులు చేయించేందుకు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆపసోపాలు పడుతున్నారు. రహదారులు అధ్వానంగా మారడంతో అక్టోబరు చివరి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, వర్షాలు తగ్గగానే పనులు చేపట్టాలని ఇటీవల సీఎం ఆదేశించారు. దీంతో టెండర్లలో గుత్తేదారులు పాల్గొనేలా చూసేందుకు ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. గుత్తేదారులు మాత్రం బకాయిలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా 9 వేల కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉంది.
దీనికి ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ) రూ.2,205 కోట్లు బ్యాంకు రుణం తీసుకుంటోంది. 1,140 పునరుద్ధరణ పనులకు అన్ని జిల్లాల్లో రెండు, మూడు సార్లు టెండర్లు పిలిస్తే 403 పనులకే బిడ్లు దాఖలయ్యాయి. మిగిలిన వాటికి గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. దీంతో ఆయా జిల్లాల్లో తాజాగా మరోసారి టెండర్లు పిలుస్తున్నారు. ఈసారి బిడ్లు వేయాలంటూ ఇంజినీర్లు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు గుత్తేదారులతో చర్చలు జరిపారు. గతవారం కూడా ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గుత్తేదారులతో జూమ్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. బకాయిలు తప్పకుండా ఇస్తామని, బిడ్లు వేయాలని కోరారు. ఈ పనులకు బ్యాంకు రుణం తీసుకోనుండటంతో చెల్లింపులకు సమస్య ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు.