‘ఒకే ఏడాదిలో రూ.2,205 కోట్లతో 9 వేల కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఇంత ఎక్కువ మొత్తం వెచ్చించలేదు' అని రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. సాధారణంగా రహదారి వేసిన అయిదేళ్ల తర్వాత పునరుద్ధరణ చేయాల్సి ఉండగా, అనేక రహదారులు ఏళ్ల తరబడి అందుకు నోచుకోలేదన్నారు.
‘రాష్ట్రంలో 46 వేల కి.మీ. ఆర్‌అండ్‌బీ రహదారులు ఉండగా, ఏటా సగటున 9 వేల కి.మీ. పునరుద్ధరించాల్సి ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ఏటా రూ.600 కోట్లు చొప్పున మాత్రమే కేటాయించడంతో బ్యాక్‌ల్యాగ్ భారీగా పెరిగిపోయింది. చాలాకాలంగా పనులు చేయనివి, నల్లరేగడి నేలలకు దగ్గరగా ఉన్నవి, కాలువలకు దగ్గరగా ఉండే రహదారులు వర్షాలకు త్వరగా దెబ్బతింటున్నాయి. రూ.2 వేల కోట్ల బ్యాంకు రుణం మంజూరవగానే... ఈ పనులకు చెందిన మిగిలిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నాం. ప్రస్తుతం వర్షాలకు అధ్వానంగా మారిన వాటికి తొలుత మరమ్మతులు చేస్తాం. డిసెంబరు నుంచి మార్చిలోపు పనులన్నీ పూర్తిచేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని’ ఆయన వివరించారు. ఇవి పూర్తయితే వచ్చే ఏడాది నుంచి వెయ్యి కి.మీ. చొప్పున పనులు చేస్తే సరిపోతుందన్నారు.
రెండేళ్లలో ఎన్‌డీబీ పనులు