రాష్ట్ర ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.25,500 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణం కావాలని రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో రుణాలు తీసుకోవడం సాధ్యం కావడంలేదు. రుణాలపై కేంద్ర, రాష్ట్రాల లెక్కలకు మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతోనే తుది త్రైమాసికం రుణ పరిమితులు తేల్చలేదని సమాచారం. మరోవైపు విద్యుత్తు సంస్కరణలను చక్కగా అమలు చేసినందుకు తాజాగా రూ.2,123 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం శుక్రవారం అనుమతిచ్చింది. ఈ సౌలభ్యాన్ని వచ్చే మంగళవారం నాటి సెక్యూరిటీ వేలంలో వినియోగించుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. శుక్రవారం రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఒకటిన సెక్యూరిటీల వేలంలో ఏపీ పాల్గొనడం లేదు. ప్రతిపాదనలు పంపేందుకు ఇంకా సమయం ఉన్నందున పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.
* జనవరిలో రూ.8,500 కోట్ల రుణం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌బీఐ క్యాలెండర్ పేర్కొంటోంది. నిజానికి ఆ క్యాలెండర్ ప్రకారం ఈనెల 4న ఏపీ రుణం తీసుకునే ప్రతిపాదన ఏదీ లేదు. 3న దిల్లీలో జరిగిన ప్రయత్నాల మేరకు రూ.2,500 కోట్లకు అవకాశం చిక్కడంతో 4న బహిరంగ వేలంలో పాల్గొని రాష్ట్రం రుణం తీసుకుంది. ఆ మేరకు 3న ఆర్‌బీఐ తన క్యాలెండర్‌ను సవరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.25,500 కోట్ల మేర రుణాలు అవసరమవుతాయని అంచనా వేసింది. జనవరిలో తొలి మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొన్న ప్రభుత్వం... ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు.